MLC 2025: ఇది కదా విధ్వంసం అంటే: 19 సిక్సర్లతో హోరెత్తించిన కివీస్ క్రికెటర్.. గేల్ ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు

MLC 2025: ఇది కదా విధ్వంసం అంటే: 19 సిక్సర్లతో హోరెత్తించిన కివీస్ క్రికెటర్.. గేల్ ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు

న్యూజిలాండ్‌ విధ్వంసకర ఓపెనర్ ఫిన్ అలెన్ టీ20 క్రికెట్ లో విధ్వంసం సృష్టించాడు. కొడితే ఫోర్ లేకపోతే సిక్సర్ అన్నట్టు బౌండరీల వర్షం కురిపించాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2025 లో భాగంగా శుక్రవారం (జూన్ 13) వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో.. శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ తరపున ఆడుతున్న అలెన్ కేవలం 51 బంతుల్లో 151 పరుగులు చేసి ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. ఈ కివీస్ క్రికెటర్ స్ట్రైక్ రేట్ 296 ఉండడం విశేషం. వాషింగ్టన్ ఫ్రీడమ్ బౌలర్లను ఊచ కొత్త కోస్తూ ఏకంగా 19 సిక్సర్లు కొట్టడం సంచలనంగా మారింది. 

అలెన్ తన విధ్వంసకర ఇన్నింగ్స్ తో పలు రికార్డ్స్ బ్రేక్ చేశాడు. టీ20 క్రికెట్ లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన గేల్, సాహిల్ చౌహాన్ పేరిట ఉన్న రికార్డ్ ను బ్రేక్ చేశాడు. గేల్, చౌహాన్ 18 సిక్సర్లతో నిన్నటివరకు టాప్ లో ఉండగా.. 19 సిక్సర్లతో అలెన్ వీరిని అధిగమించి టాప్ కు చేరుకున్నాడు. 34 బంతుల్లోనే తన సెంచరీని మార్క్ అందుకున్న ఈ కివీస్ ఓపెనర్.. ఈ టోర్నమెంట్ లో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. న్యూజిలాండ్  తరపున అదరగొడుతున్న ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో అలెన్ ను ఎవరూ కొనలేదు. రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ తో ఆక్షన్ లోకి వచ్చిన ఈ విధ్వంసకర ఓపెనర్ ను తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు. 

ఫిన్ అలెన్ (51 బంతుల్లో 151:5 ఫోర్లు, 19 సిక్సర్లు) ఈ మ్యాచ్ లో శివాలెత్తడంతో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుపై జరిగిన మ్యాచ్ లో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ 123 పరుగుల తేడాతో  భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో అలెన్ ఒక్కడే 151 పరుగులు చేయగా.. ప్రత్యర్థి జట్టు కేవలం 146 పరుగులకే ఆలౌట్ కావడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 269 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో వాషింగ్టన్ ఫ్రీడమ్ 146 పరుగులకే కుప్పకూలింది. అలెన్ కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.