మహదేవ్‌‌ బెట్టింగ్‌‌ యాప్‌‌ కేసు.. భూపేశ్​ బాఘెల్‌‌పై ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌

మహదేవ్‌‌ బెట్టింగ్‌‌ యాప్‌‌ కేసు.. భూపేశ్​ బాఘెల్‌‌పై ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌

మహాదేవ్‌‌ బెట్టింగ్‌‌ యాప్‌‌ మనీలాండరింగ్‌‌ కేసులో ఈడీ రిపోర్ట్ ప్రకారం ఎకనామిక్‌‌ అఫెన్సెన్స్‌‌ వింగ్‌‌ చత్తీస్‌‌గఢ్‌‌ మాజీ సీఎం భూపేశ్‌‌ బాఘెల్‌‌పై ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ నమోదు చేసింది.

రాయ్‌‌పూర్‌‌‌‌: మహాదేవ్‌‌ బెట్టింగ్‌‌ యాప్‌‌ మనీలాండరింగ్‌‌ కేసులో చత్తీస్‌‌గఢ్‌‌ మాజీ సీఎం భూపేశ్‌‌ బాఘెల్‌‌పై ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ నమోదైంది. ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌ (ఈడీ) రిపోర్ట్ ప్రకారం ఎకనామిక్‌‌ అఫెన్సెన్స్‌‌ వింగ్‌‌ (ఈవోడబ్ల్యూ) బాఘెల్‌‌పై ఎఫ్‌‌ఐఈర్‌‌‌‌ నమోదు చేసిందని అధికారులు ఆదివారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి దాదాపు రూ.6 వేల కోట్ల అవినీతి జరిగిందని ఈడీ తన రిపోర్ట్‌‌లో పేర్కొంది.

‘‘సంవత్సర కాలంగా ఈ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈవోడబ్ల్యూ/ఏసీబీకి సమర్పించిన నివేదిక ఆధారంగా మార్చి 4న ఇక్కడి ఈవోడబ్ల్యూ పోలీస్‌‌ స్టేషన్‌‌లో బాఘెల్‌‌తో పాటు యాప్‌‌ ప్రమోటర్లు రవి ఉప్పల్‌‌, సౌరభ్‌‌ చంద్రకర్‌‌‌‌, శుభమ్‌‌ సోనీ, అనిల్‌‌ కుమార్‌‌‌‌ అగర్వాల్‌‌తో పాటు మరో 14 మందిని ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌లో నిందితులుగా చేర్చాం”అని ఈవోడబ్ల్యూ అధికారి ఒకరు తెలిపారు.

ఈ కేసులో కొంతమంది బ్యూరోక్రాట్లు, పోలీసు అధికారులు, స్పెషల్‌‌ డ్యూటీ అధికారులు (ఓఎస్‌‌డీ), మరికొంత మంది ప్రైవేట్‌‌ వ్యక్తులను కూడా నిందితులుగా చేర్చామని వెల్లడించారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటివరకు ఈ కేసులో ఈడీ తొమ్మిది మందిని అరెస్ట్‌‌ చేసింది.