వివాదంలో ‘కాళీ’.. ద‌ర్శకురాలి పై కేసు నమోదు

వివాదంలో ‘కాళీ’.. ద‌ర్శకురాలి పై కేసు నమోదు

రచయిత్రి,  ద‌ర్శకురాలు లీనా మ‌ణిమేక‌లై వివాదంలో చిక్కుకున్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు గాను ఆమె పై కేసు నమోదైంది.  ఇంతకీ ఏం జరిగిందంటే.. మ‌ణిమేక‌లై రూపొందిస్తున్న డాక్యుమెంట‌రీ ఫిలిం ‘కాళీ’ . దీనికి సంబంధించిన పోస్టర్ ఇప్పుడు  దుమారం రేపింది.  ఈ పోస్టర్ లో కాళీమాత గెట‌ప్‌లో ఉన్న  ఓ న‌టి ఒక చేత్తో త్రిశూలం ప‌ట్టుకుని మ‌రో చేత్తో సిగిరెట్ తాగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ పోస్టర్ ను లీనా మ‌ణిమేక‌లై జూలై 2న  సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇది క్షణాల్లో వైరల్ గా మారింది.

దీనితో ఆమె పై నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్లో #arrestleenamanimekalai అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడం కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు గాను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆమె పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.  ఐపీసీ సెక్షన్లు, 120-B, 153-B, 295, 295-A, 298, 504, 505(1)(b), 505(2), 66 , 67 ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లుగా హజ్రత్‌గంజ్ పోలీసులు తెలిపారు.

అటు ఇంత రచ్చ జరుగుతున్నా మ‌ణిమేక‌లై మాత్రం వెనక్కి తగ్గడం లేదు. విమర్శించేవాళ్లు ముందుగా సినిమాని  చూడాలని ఆమె అంటున్నారు. తాను బతికి ఉన్నంతవరకు నిర్భయంగా తన గళాన్ని వినిపిస్తానని చెబుతోంది.