కేసముద్రం రైల్వే స్టేషన్‎లో అగ్ని ప్రమాదం.. బోగీలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

కేసముద్రం రైల్వే స్టేషన్‎లో అగ్ని ప్రమాదం.. బోగీలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్‎లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న ఓ రైలు బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శుక్రవారం (ఆగస్ట్ 8) తెల్లవారుజూమున ఈ ప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్లో మూడో లైన్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఇంజనీరింగ్ సిబ్బంది కోసం ఓ రెస్ట్ బోగీ ఏర్పాటు చేశారు. ప్రమాదవశాత్తూ శుక్రవారం తెల్లవారుజామున ఈ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

ప్రమాద సమయంలో కోచ్‌లో ఉన్న ఉద్యోగులు వెంటనే తేరుకుని బయటకు వచ్చేశారు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బోగీ నుంచి భారీగా మంటలు ఎగసిపడటంతో కార్మికులు, అధికారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 

ఈ ఘటనలో సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన బోగీ అగ్నికి ఆహుతి అయినట్లు అధికారులు తెలిపారు. బోగీలో అగ్ని ప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ఫైర్ యాక్సిడెంట్‎కి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. షార్ట్  సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణపాయం తప్పడంతో అధికారులు, రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.