Fire accident : సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్ లో మంటలు

Fire accident : సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్ లో మంటలు

హైదరాబాద్ : సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్వప్న లోక్ కాంప్లెక్స్ లోని 7, 8వ అంతస్తుల్లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి నాలుగు ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

మార్చి 16వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో కాంప్లెక్స్ లోని 7, 8వ అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. దట్టంగా అలుముకున్న పొగలతో ఫైర్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. కాంప్లెక్స్ లోపల పలువురు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్వప్న లోక్ కాంప్లెక్స్ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు 

SP రోడ్డులోని స్వప్న లోక్ కాంప్లెక్స్ లో జరిగిన ప్రమాదంపై సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, EVDM అడిషనల్ కమిషనర్ ప్రకాష్ రెడ్డితో జీహెచ్ఎంసీ మేయర్ విజయ లక్ష్మి మాట్లాడారు. డీఆర్ఎఫ్ టీమ్ లు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రకాశ్ రెడ్డి తెలిపారు. కాంప్లెక్స్ చుట్టుపక్కల ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వారికి సహాయ సహకారాలు అందించాలని అధికారులను మేయర్ ఆదేశించారు. 

సంఘటనా స్థలానికి మంత్రి తలసాని

విషయం తెలియగానే సంఘటనా స్థలానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అక్కడున్న అధికారులు, పోలీసులను ఆరా తీశారు. ప్రమాదంపై దర్యాప్తు చేయాలని అధికారులను  ఆదేశించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలను ముమ్మరం చేయాలని కోరారు. 

మంటలు అదుపులోకి వస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. కాంప్లెక్స్ లోపల ఎంత మంది ఉన్నారనే విషయం తెలియదన్నారు. ఇప్పటి వరకు ఫైర్ సిబ్బంది ఏడుగురిని రక్షించారని తెలిపారు. బిల్డింగ్ పై ఇరుక్కున్న వాళ్లు తమ సెల్ ఫోన్ లైట్లు వేసి చూపిస్తున్నారని, వారిని రక్షిస్తామన్నారు. పైన ఉన్న వారితో ఫోన్ లో కాంటాక్ట్ లో ఉన్నామన్నారు. 

ఇటు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా సంఘట నాస్థలానికి వచ్చారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం గురించి అధికారులను ఆరా తీశారు.