నైరోబీ: కెన్యాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ స్కూల్‌కు చెందిన హాస్టల్లో అగ్నిప్రమాదం సంభవించి 17 మంది స్టూడెంట్లు సజీవ దహనమయ్యారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. నైరీ కౌంటీలోని హిల్‌సైడ్ ఎండరాషా ప్రైమరీ స్కూల్లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతిచెందిన విద్యార్థుల వయసు 14 ఏండ్ల లోపే ఉంటుంది.
మంటలు చెలరేగిన డార్మిటరీలో 150 మందికి పైగా బాలురు ఉన్నారు. ఆ బిల్డింగ్ చెక్కతో నిర్మించడంతో మంటలు చాలా వేగంగా వ్యాపించాయని పోలీసులు తెలిపారు. విద్యార్థులు డెడ్‌బాడీలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో తమ బిడ్డల జాడ తెలియక తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఫైర్ యాక్సిడెంట్కు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై కెన్యా అధ్యక్షుడు విలియం రూటో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.