తూప్రాన్​లో భారీ అగ్నిప్రమాదం

తూప్రాన్​లో భారీ అగ్నిప్రమాదం

తూప్రాన్, వెలుగు: మెదక్ జిల్లా తూప్రాన్ లో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా దగ్గరలో ఉన్న పాత ఎస్బీహెచ్ బ్యాంకు వెనకాల ఉన్న స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగి వందల మీటర్ల మేర గాలిలో  పొగ కమ్ముకుంది. చుట్టుపక్కల గ్రామాల వరకు వ్యాపించింది. దుకాణంలో ప్లాస్టిక్ వైర్లు, మద్యం సీసాలు వంటి సామగ్రి ఉండడంతో అగ్ని కీలలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఆ వేడికి సీసలు పగిలి ఎగిరిపడ్డాయి. దుకాణంలో పని చేసేవారు బయటకు పరిగెత్తి ప్రాణాలను కాపాడుకున్నారు. మంటలు కొన్ని గంటలపాటు ఉండడంతో చుట్టుపక్కల ఇండ్ల వారు భయపడి పరుగులు తీశారు.

మంటల ప్రభావంతో వీరి ఇండ్లు దెబ్బతిన్నాయి. ఫైర్ ఇంజిన్​రావడం ఆలస్యం కావడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆరు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పట్టణంలో ఇప్పటివరకు జరిగిన అన్ని అగ్ని ప్రమాదాల్లో కెల్లా ఇదే పెద్దదని ఫైర్​ఆఫీసర్లు చెప్పారు. స్క్రాప్ దుకాణం ఇండ్ల మధ్యలో ఉందని, ప్రమాదం జరగవచ్చని గతంలో అధికారులకు చెప్పినా చర్యలు తీసుకోలేదని స్థానికులు వాపోతున్నారు. పట్టణానికి అనుకుని ఎన్నో కంపెనీలు ఉన్నాయని, ప్రమాదం జరిగినప్పుడు నర్సాపూర్ నుంచి గాని, గజ్వేల్ నుంచి గాని ఫైర్​ఇంజిన్​ వచ్చేలోపు ఎక్కువ నష్టం జరుగుతోందంటున్నారు. వెంటనే తూప్రాన్ లోనే ఫైర్ స్టేషను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.