కల్లూరు, వెలుగు: కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎల్లంకి ఎస్టేట్ సమీపంలోని జామాయిల్ తోటలో గురువారం ఆకస్మికంగా అగ్నిప్రమాదం సంభవించి తోట పూర్తిగా దగ్ధమైంది. మండుతున్న ఎండలు, వడగాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. సమీపంలోని రైస్ మిల్లులు, నివాస గృహాలకు ప్రమాదం వాటిల్లకుండా స్థానికులు నీటి బకెట్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
సమాచారం అందుకున్న ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అధికారులను అప్రమత్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్, అగ్నిమాపక, పోలీసు, విద్యుత్ శాఖల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్, మూడు వాటర్ ట్యాంకర్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. గత మూడేళ్లుగా వేసవిలో ఇదే తోటలో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని, చెత్తాచెదారం పేరుకుపోవడం, విషసర్పాల బెడద పెరిగిందని స్థానికులు తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని చైర్మన్ హామీ ఇచ్చారు
