
ఖమ్మం టౌన్,వెలుగు : దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసే బాణసంచా దుకాణాలలో వ్యాపారులు రూల్స్ తప్పనిసరిగా పాటించాలని అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్ రావు అన్నారు. బాణసంచా దుకాణాల కేటాయింపునకు బుధవారం పోలీస్ కాన్ఫిరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లాటరీ పద్ధతిలో డ్రా తీసి దుకాణాలు కేటాయించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ నిబంధనల మేరకు నగరంలోని రెండు మైదానాల్లో 128 దీపావళి బాణసంచా దుకాణాల ఏర్పాటుకు జిల్లా అధికారులు అనుమతిచ్చారని, వీటిని ఎవరు అతిక్రమించవద్దన్నారు.
డిగ్రీ కళాశాలలో 86, పెవిలియన్ మైదానంలో 42 ఏర్పాటు చేయాలని నిర్ణయించి డ్రా తీసినట్లు తెలిపారు. మొత్తం 148 మంది దరఖాస్తుదారుల్లో 128 దీపావళి బాణసంచా దుకాణాలు కేటాయించిన్నట్లు చెప్పారు. బాణసంచా విక్రయించే వ్యాపారులతో పాటు పటాకులు కాల్చే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనుమతి లేకుండా బాణసంచా నిల్వ చేసినా, తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో టౌన్ ఏసీపీ రమణమూర్తి, టూ టౌన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ పాల్గొన్నారు.