నిందితుడ్ని పట్టిస్తే డబ్బులివ్వడానికా పోలీసులు ఉన్నది?

నిందితుడ్ని పట్టిస్తే డబ్బులివ్వడానికా పోలీసులు ఉన్నది?

హైదరాబాద్: ఆరేళ్ల పసికందును ఓ రాక్షసుడు రేప్ చేసి హత్య చేయడం దారుణమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ ఘటనతో తెలంగాణ పరువు పోయిందన్నారు. చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించకడానికి సీఎం కేసీఆర్, దత్తత తీసుకున్న కేటీఆర్, డమ్మీ హోం మంత్రి మహమూద్ అలీ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాకపోవడం దారుణమన్నారు. నిందుతుడ్ని పట్టిస్తే రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించడం హాస్యాస్పదన్నారు. పోలీసులున్నది గాడిదలు కాయడానికా అని మండిపడ్డారు. 

‘చిన్నారి మృతికి ఆ రాక్షసుడు ఎంత కారణమో పోలీసులు కూడా అంతే కారణం. తల్లి ఫిర్యాదు చేసిన వెంటనే డోర్ ఓపెన్ చేసి ఉంటే పాప బతికి ఉండేది. కేటీఆర్ ప్రచారాల మంత్రి. బతుకమ్మ అంటూ తెలంగాణ అంతా తిరిగే కవిత ఇక్కడికి ఎందుకు రాలేదు? మానవత్వం ఉంటే కేటీఆర్ ఇక్కడికి రావాలి. దళిత, గిరిజన బిడ్డలని రాలేదా? కేటీఆర్ సమాధానం చెప్పాలి. దోషులను వెంటనే శిక్షించాలి. పోలీసులకు అవార్డులు వస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్నారు. డబ్బులతో అవార్డులు కొనుక్కుంటున్నారు. చిన్నారి చనిపోయిన బాధలో కుటుంబ సభ్యులు ఉంటే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామనడం బాధాకరం. చదువుకున్న కలెక్టర్ మాట్లాడే మాటలా ఇవి? సినీ యాక్టర్‌‌ను పరామర్శించే తలసాని శ్రీనివాస్ ఇక్కడికి ఎందుకు రారు?’ అని కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు.