సమ్మర్‎లో అగ్గి అంటుకుంటే ఆగమే!

సమ్మర్‎లో అగ్గి అంటుకుంటే ఆగమే!
  • ఇండస్ట్రియల్ ఎస్టేట్లలో పొంచి ఉన్న ముప్పు
  • సమీప కాలనీల్లోని జనాల్లో భయం
  • సమ్మర్ లో అలర్ట్ గా లేకుంటే ఆస్తినష్టం, ప్రాణ నష్టం
  • జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు

జీడిమెట్ల, వెలుగు: ఏండ్ల కిందట శివారులో ఏర్పాటైన ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ సిటీ విస్తరణలో భాగంగా మధ్యలోకి రావడమే కాకుండా వాటి చుట్టూ కాలనీలు  వచ్చాయి. దీంతో ప్రమాదకర పరిశ్రమలతో  ముప్పు పొంచి ఉంది. ఏటా వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉండడంతో స్థానికులు భయాందోళనతో గడుపుతుంటారు. ఏదైనా కంపెనీలో ఫైర్​యాక్సిడెంట్​అయిందంటే మంటలు ఆరే దాకా పరిసర ప్రాంతాల్లోని జనం బిక్కుబిక్కుమంటూ  బతకాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలా ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్​కు, రెసిడెన్షియల్​కాలనీలకు మధ్య బఫర్ జోన్ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. గ్రేటర్ సిటీలో  లోపల, బయట సుమారు16 ప్రధాన ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి. ఇందులో సుమారు 10 వేలకు  పైగా వివిధ రకాల  కంపెనీలుండగా, వాటిలో లక్షలాది మంది కార్మికులు పనులు చేస్తున్నారు. ఇండస్ట్రియల్ ఏరియాల్లోని పలు కంపెనీల్లో  ప్రతి ఏటా అగ్ని ప్రమాదాలు జరిగి కోట్ల రూపాయల ఆస్తినష్టం జరగడమే కాకుండా కార్మికులు కూడా ప్రాణాలు కోల్పోతుంటారు.  ప్రధానంగా ఫార్మా, కెమికల్స్ కంపెనీల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి.  ఇందుకు చాలా కంపెనీల్లో  భద్రతాపరమైన చర్యలు సరిగా లేకపోవడమే  కారణంగా కనిపిస్తుంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారం కంపెనీల నిర్వహణతో ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. జీడిమెట్ల లాంటి ఇండస్ట్రియల్ ఏరియాలోనే సగటున ఏడాదికి 100కు పైగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.  ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఏరియాల్లోని కాలనీల వాసులు వేసవిలో  మరింత అప్రమత్తంగా ఉండాలని  ఇండస్ట్రియల్​  నిపుణులు సూచిస్తున్నారు.

ఎండకాలం వచ్చిందంటే.. 
ఎండకాలం వచ్చిందంటే భయంతో వణికిపోతున్నాం. కాలనీలను ఆనుకునే పెద్ద పెద్ద  కెమికల్ కంపెనీలు ఉన్నాయి.  అగ్ని ప్రమాదం జరిగితే చాలు గంటల తరబడి మండుతాయి. ఆ మంటలు ఆరే వరకూ ఊపిరి బిగపట్టుకుని ఉండాల్సిందే.  రాత్రిపూట జరిగితే జాగారం చేయాల్సిందే.  ప్రతి ఏడాది ఇదే పరిస్థితి. కంపెనీల యజమానులు తగు జాగ్రత్తలు తీసుకుంటే అందరికి మంచిది.
-  రమణ, జీడిమెట్ల

అప్రమత్తంగా ఉండాలె
ఫార్మా, కెమికల్ కంపెనీల్లో తరచూ తనిఖీలు చేస్తున్నాం. ప్రతి  కంపెనీలో ఫైర్​సేఫ్టీ పరికరాలు తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాం. అప్రమత్తంగా ఉంటే పెను ప్రమాదాన్ని కూడా నివారించవచ్చు. తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.  ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సిద్ధంగా ఉండేలా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. 
– సుభాష్​రెడ్డి, ఫైర్ ఆఫీసర్, జీడిమెట్ల

ప్రమాదాలకు కారణాలివే..
    కంపెనీలు, పరిశ్రమల్లో భద్రతా ఏర్పాట్లపై యాజమాన్యాలు నిర్లక్ష్యంగా ఉండడం.  
    తక్కువ వేతనాలకు కార్మికులను నియమించుకోవడం, వారికి పనులపై అవగాహన లేక కూడా ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. 
    నాసిరకమైన పరికరాలు ఏర్పాటు చేసుకోవడం కూడా అగ్నిప్రమాదాలు జరిగి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతుంది.  
    కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు తమ ఉత్పత్తులు కార్మికులకు తెలియకూడదని రసాయనాలకు మారుపేర్లు పెడతాయి.  దీంతో కార్మికులు గందగోళంలో ఒకదాని బదులు మరో కెమికల్ కలపడంతో ప్రమాదాలు అవుతుంటాయి.
    కెమికల్స్​పై  కనీస అవగాహన లేనివారిని హెల్పర్లుగా నియమించుకోవడం.
 ఇలా నివారించొచ్చు 
    ప్రతి కంపెనీలో సేఫ్టీ సెల్ ఏర్పాటు చేయాలి. అది కచ్చితంగా పనిచేసేలా చూడాలి.
    రియాక్టర్ల వద్ద అనుభవం ఉన్న కెమిస్ట్​లతో  పనిచేయించాలి.
    ప్రతి కార్మికుడు, ఉద్యోగి పనిచేసేటప్పుడు సేఫ్టీ పరికరాలైన గౌను, అద్దాలు, బూట్లు, గ్లౌజ్​లు తప్పనిసరిగా ధరించేలా చూడాలి.
    ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్మికులకు ఎప్పటికప్పడు శిబిరాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలి.
    ప్రధానంగా అధికారుల పర్యవేక్షణ ఉండాలి.  

జీడిమెట్లలో ఐదేండ్లలో జరిగిన ఘటనలు 
ఏడాది    ప్రమాదాలు
2017    97
2018     110
2019    78
2020    1,000
2021     94

ఇందులో మేజర్ ఫైర్ యాక్సిడెంట్లు18 కాగా,  రూ.30కోట్ల ఆస్తినష్టం జరిగింది. ఇందులో రూ.225కోట్ల ఆస్తినష్టం జరగకుండా ఫైర్ డిపార్ట్​మెంట్ కాపాడగలిగింది. మొత్తం10 మంది చనిపోగా 11 మందిని రక్షించారు.