మొదటి రోజు టీకా లీడర్లు, సెలబ్రెటీలకు!

మొదటి రోజు టీకా లీడర్లు, సెలబ్రెటీలకు!
  • సెలబ్రెటీలకు కూడా వేయించే చాన్స్​
  • ప్రజల్లో వ్యాక్సిన్​పై అపోహలు, భయం పోగొట్టడమే లక్ష్యం
  • మార్చి ఫస్ట్ నుంచి రెండో దశ వ్యాక్సినేషన్​కు ఏర్పాట్లు
  • అదే రోజు నుంచి రిజిస్ట్రేషన్​ చేసుకునే అవకాశం
  • రాష్ట్రానికి మరో 4 లక్షల డోసులు పంపిన కేంద్రం

హైదరాబాద్‌‌, వెలుగు: రెండో దశ కరోనా వ్యాక్సినేషన్‌‌ను పొలిటికల్ లీడర్లు, సెలబ్రెటీలతో మొదలుపెట్టేందుకు రాష్ట్ర హెల్త్ డిపార్ట్‌‌మెంట్  ప్లాన్ చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా ఇతర ప్రజాప్రతినిధులందరికీ కరోనా వ్యాక్సిన్‌‌ వేయిస్తే జనాల్లో ఉన్న అనుమానాలు, భయాలు తొలగిపోతాయని భావిస్తోంది. వివిధ రంగాల ప్రముఖులను కూడా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఆహ్వానించాలని ఆలోచిస్తోంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 60ఏండ్లు పైబడినవాళ్లకు,  45 ఏండ్లు దాటి బీపీ, షుగర్ తదితర దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నోళ్లకు వ్యాక్సిన్ వేయనున్న సంగతి తెలిసిందే. మెజారిటీ ప్రజాప్రతినిధులు ఈ రెండింటిలో ఏదో ఒక కేటగిరీలో ఉంటారు. ఒకే రోజు ఎక్కువ మంది లీడర్లకు వ్యాక్సిన్‌‌  వేస్తే  ప్రజల్లో అపోహలు, భయాలు పోతాయని ఆఫీసర్లు అంటున్నారు. ప్రజలకైనా, నాయకులకైనా వ్యాక్సినేషన్‌‌ స్వచ్ఛందమేనని వారు చెప్తున్నారు. కొవిన్ యాప్‌, వెబ్‌సైట్‌లో మార్చి ఫస్ట్ నుంచి వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్ అందుబాటులోకి రానుంది. అదే రోజు నుంచి అన్ని ప్రభుత్వ దవాఖాన్లలో స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ కూడా చేస్తారు. వృద్ధులు లేదా 45 ఏండ్లు దాటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారెవరైనా కొవిన్‌లో లేదా స్పాట్‌లో  రిజిస్టర్‌‌ చేసుకోవచ్చు. తమకు నచ్చిన సెంటర్‌‌లో వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఫస్ట్ రోజు ప్రముఖులకు స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ చేసి, అదే రోజు వ్యాక్సిన్  ఇవ్వనున్నారు. ఆ తర్వాత రోజు నుంచి వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచనున్నారు.

నో చాయిస్‌

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొవిషీల్డ్‌, కొవ్యాగ్జిన్‌ వ్యాక్సిన్లను ఇస్తున్నారు. ఈ రెండింటిలో ఏ వ్యాక్సిన్ వేసుకోవాలనే చాయిస్  జనాలకు ఇవ్వకూడదని హెల్త్ డిపార్ట్‌మెంట్ నిర్ణయించింది. అందుబాటులో ఏ వ్యాక్సిన్​ ఉంటే, అదే ఇవ్వనున్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. ఫస్ట్‌ డోసుగా ఇచ్చిన వ్యాక్సిన్​నే  సెకండ్  డోసుగా కూడా ఇస్తారు. ప్రైవేట్‌ హాస్పిటళ్లలో డబ్బులు పెట్టి వ్యాక్సిన్ వేయించుకునేవాళ్లకు మాత్రం తమకు నచ్చిన వ్యాక్సిన్ వేయించుకునే చాయిస్ ఉంటుంది. మన రాష్ట్రానికి ఇప్పటి వరకు 16 లక్షల వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 3 లక్షల డోసులు కొవ్యాగ్జిన్ కాగా, మిగిలినవి కొవిషీల్డ్‌ డోసులేనని ఆఫీసర్లు చెప్పారు. గురువారం 4  లక్షల డోసులు రాగా, అవన్నీ కొవిషీల్డ్‌ డోసులేనని తెలిపారు. ఈ పదహారు లక్షల్లో ఇప్పటివరకూ సుమారు 4 లక్షల డోసులు మాత్రమే వాడారు.

నేడు మరింత క్లారిటీ

సెకండ్ ఫేజ్ వ్యాక్సినేషన్‌పై శుక్రవారం అన్ని రాష్ట్రాల హెల్త్ ఆఫీసర్లతో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారుల వీడియో కాన్ఫరెన్స్ ఉంది. ఈ కాన్ఫరెన్స్ తర్వాత పూర్తి వివరాలతో కేంద్రం గైడ్‌లైన్స్ విడుదల చేయనుంది. రిజిస్ట్రేషన్‌ కోసం ఉపయోగించాల్సిన ఐడీ కార్డులు, దీర్ఘకాలిక జబ్బులు (కొమార్బిడ్‌)లోకి వచ్చే జబ్బుల లిస్ట్ రిలీజ్ కానుంది. అలాగే, ప్రైవేట్‌లో వ్యాక్సిన్ రేట్‌ కూడా శుక్రవారం ప్రకటించే చాన్స్ ఉందని ఆఫీసర్లు అంటున్నారు.

కోల్డ్ చెయిన్‌ పాయింట్లు రెడీ

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,500 సెంటర్లలో కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు. తొలుత కొన్ని సెంటర్లతో ప్రారంభించి, ఆ తర్వాత సెంటర్ల సంఖ్యను పెంచనున్నట్టు హెల్త్ డిపార్ట్‌మెంట్ ఇప్పటికే ప్రకటించింది. వ్యాక్సిన్ డోసులను స్టోర్ చేయడానికి ఉమ్మడి జిల్లాల్లో స్టోరేజీ సెంటర్లు ఉన్నాయి. ఇవికాకుండా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 900 కోల్డ్ చెయిన్ పాయింట్లు ఉన్నాయి. రోజూ లేదా రెండ్రోజులకు ఒకసారి స్టోరేజీ సెంటర్ల నుంచి కోల్డ్ చెయిన్ పాయింట్లకు వ్యాక్సిన్  డోసులను  పంపిస్తారు. ఇందుకోసం ఒక్కో జిల్లాకు ఒక్కో ఇన్సులేటర్ వెహికల్‌ను కొనుగోలు చేశారు.