ఇవాళ బీజేపీ ఫస్ట్ లిస్ట్..తెలంగాణలో 8 సీట్లకు అభ్యర్థులు ఫైనల్!

ఇవాళ బీజేపీ ఫస్ట్ లిస్ట్..తెలంగాణలో 8 సీట్లకు అభ్యర్థులు ఫైనల్!
  • సిట్టింగుల్లో సంజయ్, అర్వింద్, కిషన్ రెడ్డికే చాన్స్
  • ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సీఈసీ మీటింగ్
  • దేశవ్యాప్తంగా 125కు పైగా లోక్ సభ స్థానాలకు క్యాండిడేట్లు కన్ఫర్మ్

న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే లోక్ సభ  ఎన్నికల బరిలో నిలిచే బీజేపీ అభ్యర్థుల ఫస్ట్  లిస్ట్  శుక్రవారం రిలీజ్  అయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 125 స్థానాలకు పైగా క్యాండిడేట్ల పేర్లను పార్టీ హైకమాండ్ ప్రకటించనుంది. తెలంగాణ నుంచి ఎనిమిది సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. 2019 మాదిరిగానే ఈ ఫస్ట్  లిస్ట్ లోనే మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పలువురు కేంద్ర మంత్రులు, సిట్టింగ్ ఎంపీలు, పార్టీ సీనియర్  నేతల పేర్లు ఉండనున్నాయి. గురువారం ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీసులో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్టీ సెంట్రల్  ఎలక్షన్  కమిటీ(సీఈసీ) సమావేశం జరిగింది. 

రాత్రి 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో అగ్ర నేతలు నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్,  సీఎం యోగి ఆదిత్య నాథ్, బోర్డు మెంబర్లు డాక్టర్  లక్ష్మణ్, దేవేంద్ర ఫడ్నవీస్, ప్రకాష్  జవదేకర్, మన్సుఖ్ మాండవియా, పుష్కర్  సింగ్ ధామి, ప్రమోద్  సావంత్, భూపేంద్ర యాదవ్, జ్యోతిరాదిత్య సింధియా, కేశవ్ మౌర్య తదితరులు పాల్గొన్నారు. యూపీ, గుజరాత్,  తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, గోవా, ఉత్తరాఖండ్, ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రాల వారీగా పలు సిట్టింగ్  స్థానాలకు, ఏకాభిప్రాయం కుదిరిన సీట్లకు అభ్యర్థుల పేర్లను ఫైనల్  చేశారు. 

2014, 2019 ఎన్నికల్లో రెండు, మూడో స్థానాల్లో నిలిచిన అభ్యర్థులను ఖరారు చేశారు. తెలంగాణకు సంబంధించిన భేటీలో రాష్ట్ర ఇన్ చార్జ్ లు తరుణ్  చుగ్, సునీల్  బన్సల్, చంద్రశేఖర్, బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్ చార్జ్  శివప్రకాశ్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ బండి సంజయ్, సుధాకర్  రెడ్డి, పలువురు పాల్గొన్నారు. శుక్రవారం విడుదలయ్యే ఫస్ట్  లిస్ట్ లో తెలంగాణలోని మొత్తం 17 లోక్ సభ స్థానాలకు ఎనిమిది చోట్ల అభ్యర్థులను ప్రకటించే చాన్స్  ఉంది. సిట్టింగ్  స్థానాల్లో సికింద్రాబాద్  నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్  నుంచి బండి సంజయ్, నిజామాబాద్  నుంచి ధర్మపురి అర్వింద్ పేర్లు ఖరారయ్యాయి. 

చేవెళ్ల నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్  రెడ్డి, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, నాగర్ కర్నూల్  నుంచి రాములు లేదా ఆయన కొడుకు భరత్  ప్రసాద్ కు టికెట్  కన్ఫం అయినట్లు తెలిసింది. మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్  సీట్లకూ  అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. మరో సిట్టింగ్  స్థానమైన ఆదిలాబాద్ ను పెండింగ్ లో పెట్టినట్లు తెలిసింది. ఇక్కడి నుంచి సిట్టింగ్  ఎంపీ సోయం బాపురావుకే మరోసారి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్నా... మాజీ ఎంపీలు రమేశ్  రాథోడ్, నగేశ్, స్థానిక నేత డాక్టర్  సుమలత టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి గెలిచిన సిట్టింగ్  ఎమ్మెల్యేలు తమ నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోకుండా టికెట్  ప్రకటించవద్దని రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. దీంతో ఈ స్థానాన్ని రాష్ట్ర కోర్  గ్రూప్  మీటింగ్ లో పక్కన పెట్టారు. 

మహబూబ్ నగర్ నుంచి అరుణ, జితేందర్, శాంతి కుమార్  పోటీ

మహబూబ్ నగర్ టికెట్ కోసం పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నేషనల్ ఎగ్జిక్యూటివ్  మెంబర్ జితేందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత శాంతి కుమార్ పోటీపడుతున్నారు. అయితే ఇటీవల జరిగిన కోర్ గ్రూప్ మీటింగ్ లో అమిత్ షా సూచనతో అరుణ, జితేందర్ రెడ్డి పేర్లను తుది జాబితాలో చేర్చారు. పార్లమెంటరీ బోర్డు మీటింగ్ లో ఈ సీటును అరుణకే కేటాయించినట్లు సమాచారం. అలాగే మల్కాజ్ గిరి సీటు విషయంలోనూ సుదీర్ఘంగా చర్చ జరిగింది. 

ఇక్కడి నుంచి టికెట్  పొందేందుకు మాజీ మంత్రి ఈటల రాజేందర్, పార్టీ సీనియర్  నేత మురళీధర్ రావు, పలువురు స్థానిక నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే బీసీ ఈక్వేషన్,  గత విజయాలను పరిగణనలోకి తీసుకొని ఈటల రాజేందర్ కే అధిష్టానం జై కొట్టినట్లు తెలిసింది. కాగా మెదక్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జహీరాబాద్, నల్లగొండ, హైదరాబాద్,  స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ఇంకా తొలి దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్  సిట్టింగ్ లపైనా పార్టీ గురిపెట్టింది. ఇందులో భాగంగా నాగర్ కర్నూల్ ఎంపీ రాములుకు ఇప్పటికే పార్టీ కండువా కప్పింది. ఇదే దారిలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వర్  రావు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్  కూడా కమలం గూటికి చేరుతారన్న ప్రచారం ఢిల్లీలో జోరుగా సాగుతోంది.