ఎస్సీ గురుకులాల్లో మెకనైజ్డ్ కిచెన్.. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు

ఎస్సీ గురుకులాల్లో మెకనైజ్డ్ కిచెన్.. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు
  •     షేక్ పేట సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో ప్రారంభించిన మంత్రి అడ్లూరి 
  •     ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగనివ్వబోమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో తొలి సారిగా ఎస్సీ గురుకులాల్లో మెకనైజ్డ్  సెంట్రల్ కిచెన్ ను షేక్ పేట సెంటర్  ఆఫ్ ఎక్సలెన్సీ క్యాంపస్ లో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్  ప్రారంభించారు. ఇలాంటి మోడల్ కిచెన్ ను ఏర్పాటు చేయడం రాష్ట్రంలో తొలిసారి అని మంత్రి చెప్పారు. కిచెన్ ను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు.

   ‘‘గత ప్రభుత్వాలు విద్య, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయి. గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న డైట్, మెస్ చార్జీలను క్లియర్  చేశాం. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్  ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. వెల్ఫేర్  హాస్టల్స్  కోసం రిలీఫ్  ఫండ్  నుంచి సీఎం రేవంత్  రెడ్డి రూ.60 కోట్లు కేటాయించారు. ఇందుకు అన్ని సంక్షేమ శాఖల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 

అలాగే, హైదరాబాద్ కు చెందిన సోహమ్ ఇంపెక్స్  పీవీటీ లిమిటెడ్, ఆక్సిఫ్యూల్  రెటిఫ్లో టెక్నాలజీస్  కంపెనీలు కూడా  కిచెన్ కు అత్యాధునిక టెక్నాలజీ సహకారం అందించాయి. ఇందుకు ఆ రెండు కంపెనీలకు ధన్యవాదాలు” అని మంత్రి పేర్కొన్నారు. ఈ కిచెన్  ద్వారా తక్కువ టైమ్ లో ఎక్కువ మందికి భోజనం అందించవచ్చని మంత్రి వెల్లడించారు. 

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్  యాదవ్  మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తొలిసారి వెల్ఫేర్  హాస్టల్స్  కార్యక్రమానికి హాజరవడం ఆనందంగా ఉందన్నారు. షేక్ పేట స్కూల్ కు కావాల్సిన స్పోర్ట్స్  మెటీరియల్ ను తాను ఉచితంగా అందిస్తానని ఎమ్మెల్యే తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్  ప్రకటించారు.