V6 News

ఎన్నికేదైనా.. యాదాద్రినే టాప్!..తొలి విడత పంచాయతీ పోలింగ్ లో ప్రథమ స్థానం

ఎన్నికేదైనా.. యాదాద్రినే టాప్!..తొలి విడత పంచాయతీ పోలింగ్ లో ప్రథమ స్థానం
  •     రాష్ట్రంలోనే జిల్లా 92.88 శాతంతో అధికంగా నమోదు 
  •     2019 పంచాయతీ ఎన్నికల్లోనూ యాదాద్రి  ఫస్ట్ ప్లేస్  
  •     అసెంబ్లీ, లోక్ సభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చైతన్యం చూపిన జిల్లా ఓటర్లు

యాదాద్రి, వెలుగు :  అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ, పంచాయతీ.. ఇలా.. ఏ ఎన్నికలైనా యాదాద్రి భువనగిరి జిల్లా టాప్ లో నిలుస్తోంది. తాజాగా తొలివిడత పంచాయతీ ఎన్నికల్లోనూ జిల్లా ఓటర్లు చైతన్యం చూపారు. భారీగా ఓటింగ్​లో పాల్గొనడంతో  రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్​శాతం జిల్లాలోనే ఎక్కువగా నమోదైంది. 2019 పంచాయతీ ఎన్నికల నుంచి ఇప్పటివరకూ జరిగిన ప్రతి ఎన్నికలోనూ జిల్లా ఓటర్లు ప్రథమస్థానంలోనే నిలుస్తున్నారు. 

2019  పంచాయతీ ఎన్నికల్లో..

2019లో మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లా టాప్​లో నిలిచింది. ప్రతి దశలోనూ పోలింగ్​శాతం ఎక్కువగా నమోదైంది. తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో  యాదాద్రి జిల్లా 95.32 శాతం  నమోదు చేసి ప్రథమస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఖమ్మం జిల్లా (93.92), మూడో స్థానంలో రంగారెడ్డి జిల్లా ( 92.67), చివరన వికారాబాద్​జిల్లా (68.25) నిలిచాయి. రెండో దశలోనూ ఫస్ట్ ప్లేస్ లో యాదాద్రి జిల్లా (93.71), రెండో స్థానంలో సూర్యాపేట జిల్లా (92.82) ,మూడో స్థానంలో మెదక్​ జిల్లా (92.52),  చివరి స్థానంలో జగిత్యాల జిల్లా ( 80.23) నిలిచాయి.  

మూడో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ టాప్ లో యాదాద్రి జిల్లా (94.56),  రెండో స్థానంలో ఖమ్మం జిల్లా (94.99), మూడో స్థానంలో సూర్యాపేట జిల్లా(92.60), లాస్ట్ ప్లేస్ లో జగిత్యాల జిల్లా (77.70) నిలిచాయి.  ఈ ఎన్నికల్లో  ఓవరాల్​గా యాదాద్రి జిల్లా 94.60 శాతం పోలింగ్​తో రాష్ట్రంలోనే  ఫస్ట్​ప్లేస్ లో నిలిచింది.  రెండో స్థానంలో ఖమ్మం జిల్లా( 93.46), మూడో స్థానంలో సూర్యాపేట జిల్లా (92.60),  చివరిస్థానంలో వికారాబాద్ జిల్లా (77.04) నిలిచాయి.  అప్పటి ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 87.30 పోలింగ్​శాతం నమోదైంది. 

ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో.. 

గురువారం జరిగిన  ఫస్ట్​ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఓవరాల్​గా 84.28 శాతం పోలింగ్​నమోదైంది. ఇందులో 92.88 శాతం పోలింగ్​తో యాదాద్రి  ఫస్ట్​ గా నిలవగా, 71.29 శాతంతో భద్రాద్రి కొత్తగూడెం చివరి స్థానంలో నిలిచింది. 

గతం కంటే తగ్గిన పోలింగ్..

2019 ఎన్నికల కంటే ఈసారి ఫస్ట్​ ఫేజ్​లో పోలింగ్​శాతం తగ్గింది. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ఫస్ట్​ ఫేజ్​లో 85.78 శాతం పోలింగ్​నమోదు కాగా,  ఈసారి 84.28 శాతం నమోదైంది.  అప్పటి ఎన్నికల్లో యాదాద్రి జిల్లాలోనూ ఫస్ట్​ ఫేజ్​లో 95.32 శాతం పోలింగ్​నమోదు కాగా, ఇప్పుడు 92.88 శాతం నమోదైంది. గత ఎన్నికల్లో సూర్యాపేట జిల్లాలో 92.35 శాతం నమోదు కాగా, ఈసారి 89.62 నమోదైంది. నల్గొండలో 91.28 నమోదు కాగా ఇప్పుడు  90.53 శాతం నమోదైంది.

అన్ని ఎన్నికల్లో టాపే..

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచి యాదాద్రి జిల్లా ప్రజలు ఓటు హక్కులో  పాల్గొని టాప్​లో నిలిచారు. జిల్లాలో 4,50,207 మంది ఓటర్లకు, 4,06,804 మంది ఓటర్లు(90.36 శాతం) ఓటు హక్కు వినియోగించు కుని రాష్ట్రంలోనే తొలిస్థానంలో నిలిచారు. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఆలేరులో 90.77 ,  భువనగిరిలో 89.91 నమోదవగా.. ఇవి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. లోక్​సభ ఎన్నికల్లోనూ జిల్లా పరిధిలోని ఆలేరు, భువనగిరి సెగ్మెంట్లలో 4,55,866 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 3,77,299 మంది ఓటర్లు (82.70 శాతం) ఓటు హక్కును వినియోగించుకొని టాప్​లో నిలిచారు. 

నల్లగొండ –-వరంగల్​– -ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యాదాద్రి జిల్లా ఓటర్లు ప్రథమస్థానంలో నిలిచారు. జిల్లాలో 34,080 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లకు గాను.. 26,785 మంది ఓటర్లు (78.59 శాతం) ఓటు హక్కు వినియోగించుకొని ఇతర జిల్లాల కంటే టాప్​లో నిలిచారు.