- తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు
ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 24 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.
బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 2న ఆర్టీసీ విలీనం ప్రకటన చేస్తామని ప్రభుత్వం తెలిపినా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని అన్నారు.
2019 సమ్మె సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. కొంతమంది యూనియన్ నాయకులు సమస్యలను తప్పుదోవ పట్టిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో యూనియన్ నాయకులు గోలి రవీందర్, సాములయ్య, ప్రేమ్‌నాథ్, సుధాకర్, మురళి, పాండు తదితరులు పాల్గొన్నారు.
