చరిత్ర : రామజన్మ స్థలం

చరిత్ర : రామజన్మ స్థలం

అయోధ్య... మనదేశంలోని అతిపురాతన నగరాల్లో ఒకటి. అయోధ్యను ‘సాకేతపురం’ అని కూడా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్​లోని  ఫైజాబాద్​ జిల్లాని ఆనుకుని, సముద్రమట్టానికి 305 అడుగుల ఎత్తులో  గంగానదీ తీరాన సరయు నదికి కుడివైపున ఉంది. రామాయణంలో అయోధ్య నగర వైశాల్యం 250 చదరపు కిలో మీటర్లుగా ఉంది. మొదటిసారి అయోధ్యను రాజధానిగా చేసుకుని కోసల రాజ్యాన్ని పాలించాడు సూర్య వంశ రాజైన ఇక్ష్వాకుడు. 

తర్వాత రాజు మాంధాత, సూర్యవంశంలోని 31వ రాజు హరిశ్చంద్రుడు ఈ రాజ్యాన్ని పాలించారు. ఆయన వంశస్థుడైన సగరుడు అశ్వమేధయాగం చేశాడు. తర్వాత రఘుమహారాజు రాజ్య విస్తరణ చేశాడు. అప్పటి నుంచి సూర్యవంశాన్ని రఘువంశంగా కూడా పిలవడం మొదలైంది. రఘుమహారాజు మనవడు దశరథుడు. 63వ సూర్య వంశ రాజైన దశరథుడి రాజ్యసభగా ఉండేది అయోధ్య. దశరథుడి కొడుకైన శ్రీరాముడు అయోధ్యను పాలించాడు. 

పురాణాల్లో..

స్కంద పురాణంతోపాటు ఇతర పురాణాలు మనదేశంలోని ఏడు సప్తపురాల్లో అయోధ్య ఒకటి అని చెప్తున్నాయి. హిందూ పవిత్ర గ్రంథాలలో ఈ పురాలు చాలా ముఖ్యమైనవి. అధర్వణ వేదం అయోధ్య దేవనిర్మితమని.. అది స్వర్గసమానమని చెప్తుంది. వాల్మీకి రాసిన రామాయణం మొదటి అధ్యాయంలో అయోధ్యను ఆకాశానికెత్తాడు. దాంతోపాటు కోసల సామ్రాజ్య వైభవం గురించి గొప్పగా చెప్పాడు. తులసీదాస్​ రాసిన రామచరిత్​ మానస్​లో అయోధ్యను వర్ణించాడు. అలాగే తమిళ వైష్ణవ భక్తులైన ఆళ్వారులు ఈ నగరాన్ని తమ రచనల్లో అద్భుతంగా వర్ణించారు. 

ఆయుద్ద్​ పేరు మీదుగా..

మహారాజైన ఆయుధ్ పురాణాల్లో శ్రీరాముడి పూర్వీకుడు అని ఉంది. ఆయన పేరు సంస్కృత పదం ‘యుద్ధ్’ నుంచి వచ్చింది. ఆయుద్ధ్​ అన్నింటా గెలిచేవాడు కనుక ఆయన పేరుమీదుగా ఈ నగరానికి ‘అయోధ్య’ అనే పేరు వచ్చింది. అయోధ్య అంటే ‘జయించ శక్యం కానిది’ అని అర్థం. బుద్ధుడి కాలంలో ఈ నగరం పాళి భాషలో ‘అయోజిహా’ అని పిలిచారు. దానికి కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్థం. 

క్రీస్తు పూర్వం ఈ నగరాన్ని సాకేతపురం అని పిలిచేవాళ్లు. క్రీస్తు శకం127వ సంవత్సరంలో సాకేతపురాన్ని కుషన్ చక్రవర్తి జయించాడు. ఆ చక్రవర్తి అయోధ్య కేంద్రంగా తూర్పు ప్రాంతాన్ని పాలించాడు. ఆ తర్వాత ఫాక్సియన్ పేరుతో పిలిచారు. మొఘల్ పాలనా కాలంలో ఇది గవర్నర్ ఆయుద్ధ్​ స్థానంగా ఉండేది. బ్రిటిష్ వాళ్లు పాలించేటప్పుడు ఈ నగరాన్ని ‘అవధ్’ అని పిలిచేవారు. అలాగే బ్రిటిష్​ వారి కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘ఆగ్రా, అవధ్’​ ఒక భాగంగా ఉండేవి. 

వివాదం రగిలింది

మొఘల్ వంశ స్థాపకుడు బాబర్ కాలంలోనే ఇక్కడ బాబ్రీ మసీదు కట్టారు. అప్పటికే అక్కడ ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టాడనేది కొందరి వాదన.1992వ సంవత్సరంలో కరసేవకులు, దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వెళ్లారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్​ లాంటి కొన్ని సంస్థల నేతృత్వంలో మసీదు కూల్చివేత జరిగింది. నవంబర్‌ 9,‌ 2019న సుప్రీం కోర్ట్​ వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని తుది తీర్పు ఇచ్చింది. దాంతో దశాబ్దాల వివాదానికి తెరపడింది.

వాళ్లకు కూడా ముఖ్యమైనదే

జైన మతస్థులకు కూడా అయోధ్య ముఖ్యమైన నగరం. రెండు వేల ఏండ్లకు ముందే ప్రముఖ తీర్థంకరులిద్దరు అయోధ్యలో పుట్టారు. మరో అయిదుగురు తీర్థంకరులకు కూడా ఇదే జన్మస్థలం. అంతేకాదు... అయోధ్య బౌద్ధమత వారసత్వం కలిగిన నగరం కూడా. అందువల్ల ఇక్కడ మౌర్య చక్రవర్తుల కాలంలో కట్టిన బౌద్ధాలయాలు, స్మారక చిహ్నాలు, శిక్షణాకేంద్రాలు ఉన్నాయి. గుప్తుల కాలంలో వాణిజ్యం​లో అయోధ్య ఎంతో ఎత్తుకు ఎదిగింది. క్రీస్తుపూర్వం 600ల కాలంలో కూడా అయోధ్య వాణిజ్య కేంద్రంగానే ఉంది. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దం నుంచి క్రీస్తుశకం ఐదో శతాబ్దం వరకు బౌద్ధమత కేంద్రంగా ఉండేది. ఈ నగరానికి బుద్ధుడు చాలాసార్లు వచ్చినట్లు చెప్తుంటారు.