సంగారెడ్డి (హత్నూర), వెలుగు: చేపల కాపలాకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మత్స్యకారుడు చనిపోయిన సంగారెడ్డి మండల కేంద్రమైన హత్నూరలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రామే సత్యనారాయణ(46) బుధవారం సాయంత్రం భోజనం చేసిన అనంతరం చాకిచెరువు వద్ద చేపల కాపలాకు వెళ్తున్నానని కుటుంబీకులకు తెలిపి ఇంట్లో నుంచి వెళ్లాడు.
ఇంటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబీకులు వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం తెల్లవారుజామున చాకిచెరువులో సత్యనారాయణ శవమై తేలి ఉండడంతో కుటుంబీకులు చనిపోయినట్లు గుర్తించారు. మృతుడి భార్య సక్కుబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం శవాన్ని నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.
