RTA కొత్త రూల్..‘స్పీడ్‌‌ గవర్నర్‌‌’ ఉంటేనే ఎఫ్‌‌సీ

RTA కొత్త రూల్..‘స్పీడ్‌‌ గవర్నర్‌‌’ ఉంటేనే ఎఫ్‌‌సీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగువాహనాల్లో ‘స్పీడ్​ గవర్నర్’అమలుపై ఆర్టీఏ కొత్త రూల్​ తెచ్చింది. స్పీడ్‌‌‌‌ గవర్నర్ ఉంటేనే ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌(ఎఫ్‌‌‌‌సీ) రెన్యువల్‌‌‌‌ చేయాలని గత శుక్రవారం అన్ని ఆర్టీఏ ఆఫీసులకూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 12 నుంచి స్కూల్స్​ రీ ఓపెనింగ్​ కానున్నాయి. దీంతో స్కూల్‌‌‌‌ బస్సుల ఎఫ్​సీల కోసం సోమవారం ఆర్డీఏ ఆఫీసులకు వచ్చిన పాఠశాలల యాజమాన్యాలు కొత్త నిబంధన తెలిసి షాక్​ తిన్నాయి. కమిషనర్‌‌‌‌ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయని, స్పీడ్‌‌‌‌ గవర్నర్‌‌‌‌ ఉంటేనే ఎఫ్​సీ జారీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక స్కూల్‌‌‌‌ బస్సులకు ఎఫ్​సీ చేయించుకోకుండానే వెనుదిరిగారు.

రెండు నెలల క్రితమే జీవో? 

2015 ఏప్రిల్‌‌‌‌ 15న కేంద్ర రవాణా శాఖ స్పీడ్‌‌‌‌ గవర్నర్‌‌‌‌ అమలుకు సంబంధించి రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. స్కూల్‌‌‌‌ బస్సులు, డంప్‌‌‌‌ చేసే వాహనాలు, ట్యాంకర్లు, 8 సీటింగ్‌‌‌‌ కెపాసిటీ ఉండే ప్యాసింజర్ వెహికిల్స్‌‌‌‌, హానికరమైన రసాయనాలు, ఇతర పదార్థాలు రవాణా చేసే వాహనాలకు స్పీడ్‌‌‌‌ గవర్నర్‌‌‌‌ తప్పనిసరి అని ప్రకటించింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కమిటీ వేసి సలహాలు, సూచనలు స్వీకరించింది. వాహనాలకు ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ టెస్ట్​ చేసే సమయంలో ఆర్టీఏ అధికారులు స్పీడ్​ గవర్నర్​ను పరీక్షిస్తారు. స్పీడ్‌‌‌‌ గవర్నర్‌‌‌‌ లేకుంటే ఎఫ్ సీ జారీ చేయరు. 2015 అక్టోబర్‌‌‌‌ తర్వాత తయారైన వాహనాలకు స్పీడ్​ గవర్నర్​ ఇన్‌‌‌‌బిల్ట్‌‌‌‌గా వస్తోంది. 2015 అక్టోబర్ కంటే ముందు వాహనాలకు స్పీడ్‌‌‌‌ గవర్నర్‌‌‌‌ కచ్చితంగా అమర్చుకోవాలి. కొత్త రూల్స్​ ప్రకారం 2015 అక్టోబర్‌‌‌‌ కంటే ముందున్న వాహనాలకు గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని పరిమితిగా విధించారు. ఆ తర్వాత వచ్చిన వాహనాలకు గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని నిర్ణయించారు. ఈ ఏప్రిల్​లో స్పీడ్‌‌‌‌ గవర్నర్‌‌‌‌ను తప్పకుండా అమలు చేయాలని జీవో జారీ చేసినట్లు తెలిసింది. అయితే దీనిని తప్పనిసరిగా అమలు చేయాలని ఈ నెల 7న అన్ని కార్యాలయాలకూ ఉత్తర్వులు జారీ చేసింది.

12,947 బస్సులకు నో ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌

రాష్ట్రంలో 26,091 స్కూల్‌‌‌‌ బస్సులు ఉన్నాయి. సోమవారం వరకు 13,144 బస్సులకు మాత్రమే ఎఫ్​సీ రెన్యూవల్​ చేశారు. 12,947 బస్సులు రెన్యూవల్‌‌‌‌ చేయించుకోవాల్సి ఉంది. స్కూళ్ల ఓపెనింగ్​కు ఒక్క రోజు మాత్రమే ఉంది. తాజా రూల్స్​తో ఈ బస్సులకు వెంటనే రెన్యూవల్​ చేసే అవకాశం లేదు. మరోవైపు స్కూల్​ యాజమాన్యాలు కూడా ఎఫ్​సీ రెన్యూవల్‌‌‌‌పై నిర్లక్ష్యం వహిస్తున్నాయి. దీంతో ఫిట్​నెస్ లేని బస్సుల్లోనే స్టూడెంట్లు స్కూళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.