- ధరలూ తగ్గుతాయి
- రేట్ల కోతకు చాన్స్
- అంచనా వేసిన ఫిచ్
న్యూఢిల్లీ : దేశీయంగా డిమాండ్, వ్యాపారాలకు అవకాశాలు బలంగా ఉండటంతో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి అంచనాను ఫిచ్ రేటింగ్స్ గురువారం 7 శాతానికి పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికం (అక్టోబర్–-డిసెంబర్)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఊహించిన దానికంటే ఎక్కువ (8.4 శాతం) వృద్ధి చెందింది. 2023–-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం పెరుగుతుందని ఫిచ్ అంచనా వేసింది. ప్రభుత్వం అంచనా వేసిన 7.6 శాతం కంటే ఇది స్వల్పంగా ఎక్కువ.
దేశీయ డిమాండ్ వల్ల త్రైమాసిక అంచనాలను మించి దేశ ఆర్థిక వృద్ధి కొనసాగిందని రేటింగ్ ఏజెన్సీ తన తాజా 'గ్లోబల్ ఎకనామిక్ ఔట్‌లుక్'లో పేర్కొంది. 2024 ప్రపంచ జీడీపీ వృద్ధి అంచనాను 0.3 శాతం పాయింట్ల నుంచి 2.4 శాతానికి పెంచింది, వృద్ధి అవకాశాలు మెరుగుపడటమే ఇందుకు కారణమని పేర్కొంది. అమెరికాకు సంబంధించిన అంచనాలను 0.3 పర్సంటేజ్ పాయింట్లు పెంచి 2.4 శాతానికి చేర్చింది.
చైనా జీడీపీ గ్రోత్ డౌన్!
చైనాపై వేసిన అంచనాలను 4.6 శాతం నుంచి 4.5 శాతానికి, యూరోజోన్ అంచనాలను 0.7 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గించింది. చైనా మినహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వృద్ధి 0.1 శాతం నుంచి 3.2 శాతానికి సవరించామని వెల్లడించింది. యూరోజోన్ కోలుకోవడంతో 2025లో ప్రపంచ వృద్ధి 2.5 శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది. భారత ఆర్థిక వ్యవస్థపై స్పందిస్తూ "వరుసగా మూడు త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి 8 శాతానికి మించి ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధి ఊపు కొనసాగవచ్చు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 7.8 శాతం వృద్ధిని అంచనా వేయవచ్చు”అని ఫిచ్ రిపోర్ట్ పేర్కొంది. 2023 చివరి నెలల్లో వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం ఆహార ధరల వల్ల పుంజుకుందని తెలిపింది. సీపీఐ ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో సంవత్సరానికి 5.7 శాతానికి చేరుకుంది.
ఇది ఫిబ్రవరిలో 5.1 శాతానికి పడిపోయింది. ఆహార ధరలు ద్రవ్యోల్బణానికి కీలకం కాగలవని పేర్కొంది. ఈ క్యాలెండర్ సంవత్సరాంతానికి హెడ్‌లైన్ ద్రవ్యోల్బణం క్రమంగా ఆర్బీఐ లక్ష్యం 4 శాతానికి తగ్గవచ్చని అంచనా వేసింది. ఫలితంగా ఆర్బీఐ రేట్లు తగ్గించవచ్చని సీఐఐ రిపోర్ట్ పేర్కొంది.
