జీడీపీ వృద్ధి 6.9 శాతం.. 2025-26 అంచనాను 6.5 శాతం నుంచి పెంచిన ఫిచ్‌‌‌‌‌‌‌‌

జీడీపీ వృద్ధి 6.9 శాతం.. 2025-26 అంచనాను 6.5 శాతం నుంచి పెంచిన ఫిచ్‌‌‌‌‌‌‌‌
  • ఈ ఏడాది మన జీడీపీ వృద్ధి అంచనాలు పెంచిన మొదటి ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ ఇదే
  • ఏడీబీ, ఐఎంఎఫ్‌‌‌‌‌‌‌‌, వరల్డ్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌  అంచనాల కంటే ఎక్కువ
  • జీఎస్‌‌‌‌‌‌‌‌టీ తగ్గింపుతో వినియోగానికి బూస్ట్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  భారత్ జీడీపీ  వృద్ధి 6.9 శాతంగా నమోదవుతుందని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ప్రకటించింది. గతంలో వేసిన అంచనా 6.5 శాతం నుంచి పెంచింది. ఫిచ్‌‌‌‌‌‌‌‌ ఈ ఏడాది మన జీడీపీ వృద్ధి అంచనాలను పెంచిన మొదటి ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ. గతంలో అనేక సంస్థలు వాణిజ్య, టారిఫ్ అనిశ్చితుల కారణంగా అంచనాలను తగ్గించాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా జీడీపీ  7.8 శాతం వృద్ధి చెందింది.

అంతకు ముందు క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7.4 శాతం గ్రోత్ నమోదైంది. దేశంలో వినియోగం పెరగడంతో ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి వృద్ధి చెందింది. మార్చి-జూన్ మధ్య ఆర్థిక కార్యకలాపాలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌– జూన్  క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  6.7 శాతం వృద్ధి నమోదవుతుందని గతంలో ఫిచ్‌‌ అంచనావేసింది. కానీ, ఈ అంచనాకు మించి జీడీపీ పెరగడం గమనార్హం. తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంలో  6.9 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. 

టారిఫ్ సవాళ్లు ఉన్నా..
ఈ రేటింగ్ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం,  ఇటీవల అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగాయి. యూఎస్‌‌‌‌‌‌‌‌ భారత దిగుమతులపై అదనంగా 25 శాతం టారిఫ్ విధించింది. ఆగస్టు 27 నుంచి ఇండియా వస్తువులపై 50 శాతం డ్యూటీ పడుతోంది.  “ఈ టారిఫ్‌‌‌‌‌‌‌‌లు భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉన్నా, వాణిజ్య సంబంధాలపై ఉన్న అనిశ్చితి వ్యాపార విశ్వాసాన్ని, పెట్టుబడులను ప్రభావితం చేయొచ్చు. ప్రభుత్వం తెచ్చిన  జీఎస్‌‌‌‌‌‌‌‌టీ సంస్కరణలతో  వినియోగం కొంత మేర  పెరిగే అవకాశం ఉంది” అని ఫిచ్ పేర్కొంది.

దేశీయ డిమాండ్ ఊపందుకుంటుందని, ప్రజల ఆదాయాలు పెరిగితే వినియోగం పెరుగుతుందని అభిప్రాయపడింది. ఫైనాన్షియల్ పరిస్థితులు మెరుగవ్వడంతో  పెట్టుబడులకు  సపోర్ట్ లభిస్తుందని తెలిపింది.  అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో భాగం (అక్టోబర్–-మార్చి)లో వృద్ధి కొంత మందగించవచ్చని అంచనా వేసింది. ఈ సంస్థ  అంచనాల ప్రకారం, 2026-27 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ  వృద్ధి 6.3 శాతంగా, 2027–28 లో 6.2 శాతంగా నమోదవుతుంది.

కంట్రోల్లో ద్రవ్యోల్బణం..
అధిక వర్షపాతం, ఆహార నిల్వలు పెరగడంతో ఫుడ్‌‌‌‌‌‌‌‌ ధరలు పెద్దగా పెరగవని, ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉంటుందని  ఫిచ్ అభిప్రాయపడింది. ఈ ఏడాది చివరికి రిటైల్‌‌‌‌‌‌‌‌ ద్రవ్యోల్బణం 3.2శాతంగా, వచ్చే ఏడాది చివరి నాటికి 4.1 శాతంగా నమోదవుతుందని తెలిపింది. “ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఈ ఏడాది చివరిలో మరో 25 బేసిస్ పాయింట్లు రేటు తగ్గించే అవకాశం ఉంది. 2026 వరకు రేట్లు స్థిరంగా ఉంటాయి. 2027లో మళ్లీ రేట్లు పెరగొచ్చు” అని  వివరించింది.