
న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణ అసెంబ్లీ ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఐదుగురు ఏఐసీసీ అబ్జర్వర్లను నియమించింది. ఈ మేరకు శనివారం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ అబ్జర్వర్ల లిస్టులో కర్నాటక డిప్యూటీ సీఎం డీ.కే శివకుమార్, కీలక నేతలు దీపా దాస్ మున్షీ, డాక్టర్ అజోయ్ కుమార్, కె.మురళీధరన్, కే.జే జార్జ్ ఉన్నారు. ఇక, రాజస్థాన్ ఓట్ల కౌంటింగ్ అబ్జర్వర్లుగా సీనియర్ నేతలు భూపిందర్ సింగ్ హుడా, మధుసూదన్ మిస్త్రీ, ముకుల్ వాస్నిక్, షకీల్ అహ్మద్ ఖాన్ లకు బాధ్యతలు అప్పగించారు.
చత్తీస్‌గఢ్ కు అజయ్ మాకెన్, రమేశ్ చెన్నితల, ప్రీతమ్ సింగ్ లను పంపారు. మధ్యప్రదేశ్ కు లోక్ సభ పక్షనేత అధిర్ రంజన్ చౌదరీ, పృథ్వీరాజ్ చవాన్, రాజీవ్ శుక్లా, చంద్రకాంత్ హాందోరే లకు పవర్ ఇచ్చారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల జనరల్ సెక్రటరీలు, ఇన్ చార్జ్ లు ఈ అబ్జర్వర్లతో కలిసి పని చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.