శాసన మండలి: ఐదు బిల్లులకు ఓకే

శాసన మండలి: ఐదు బిల్లులకు ఓకే

శాసనమండలి ఒక రోజు సమావేశాల్లో ఐదు బిల్లులు ఆమోదం పొందాయి. మెడికల్​ కాలేజీల్లోని ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపు, కొత్త మున్సిపల్​ చట్టం, మున్సిపల్​సవరణ, రాష్ట్ర రుణ విమోచన కమిషన్‌‌‌‌, పంచాయతీ రాజ్‌‌‌‌ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించారు. మెడికల్‌‌‌‌ కాలేజీల్లో అసిస్టెంట్‌‌‌‌, అసోసియేట్‌‌‌‌ ప్రొఫెసర్ల కొరత ఉందని, వయసు పెంపు ద్వారా సమస్య కొంత తీరుతుందని మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌ చెప్పారు. ఆయుష్‌‌‌‌లోనూ వయసు పెంపు విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

రైతులను ఆదుకునేందుకు కమిషన్

భూమి ఉన్నోళ్లే రైతులని, పాస్‌‌‌‌ బుక్‌‌‌‌ ఉన్నవారికే రైతుబంధు ఇస్తామని మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి చెప్పారు. సన్న, చిన్నకారు రైతులను ఆదుకునేందుకు రుణ విముక్తి కమిషన్‌‌‌‌ తీసుకొస్తున్నామని.. హైకోర్టు రిటైర్డ్‌‌‌‌ జడ్జితోపాటు నలుగురు సభ్యులు ఉంటారని తెలిపారు. లోన్‌‌‌‌ వైవర్‌‌‌‌ స్కీంను త్వరలోనే అమలు చేస్తామన్నారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకే మున్సిపల్‌‌‌‌ చట్ట సవరణ చేస్తున్నామని తెలిపారు. వార్డుల విభజన సక్రమంగానే జరిగిందన్నారు. కాగా మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారం కోసం అప్పీలేట్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ ఉండాలని ఎమ్మెల్సీ భానుప్రసాద్‌‌‌‌ సూచించారు. చెత్త సమస్యతో జనం ఇబ్బందులు పడుతున్నారని, హైదరాబాద్‌‌‌‌లో మాదిరి అన్నిచోట్లా డంపింగ్​ యార్డులు ఏర్పాటు చేయాలని కోరారు. ఇక మున్సిపాలిటీల్లో చర్చిల నిర్మాణ అనుమతుల కోసం టౌన్‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, వెంటనే పర్మిషన్‌‌‌‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ రాజేశ్వర్‌‌‌‌రావు ప్రభుత్వాన్ని కోరారు.

స్వయం ప్రతిపత్తికి విఘాతం

మున్సిపల్​ చట్టం స్థానిక సంస్థల స్వయం ప్రతిపత్తికి విఘాతం కలిగించేలా ఉందని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌ రెడ్డి అన్నారు. వార్డుల విభజన, మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం అసమంజసంగా ఉందని చెప్పారు. జగిత్యాలలో అలాగే జరిగిందని, కలెక్టర్‌‌‌‌ రివ్యూ చేసి పరిష్కరించాలని కోరారు. రైతులకు బ్యాంకు రుణాలు అందడం లేదని, దీనిపై ప్రభుత్వం కల్పించుకోవాలని డిమాండ్​ చేశారు. ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌‌‌‌రావు డిమాండ్​ చేశారు. వార్డుల విభజన, రిజర్వేషన్‌‌‌‌ సరిగా చేయలేదని ఆరోపించారు. కొత్త చట్టంతో ప్రజాస్వామ్యానికి ఇబ్బంది కలుగుతుందన్న అభిప్రాయం వస్తోందని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చెప్పారు. బిల్లులో మార్పులు చేయాలన్నారు.

పదకొండు కొత్త ముఖాలు

గత సమావేశాలతో పోలిస్తే శుక్రవారం మండలిలో 13 మంది కొత్త ఎమ్మెల్సీలు ఉన్నారు. అందులో మహమూద్‌‌‌‌ అలీ, ఎంఎస్‌‌‌‌ ప్రభాకర్‌‌‌‌ మినహా మిగతా వారంతా తొలిసారిగా ఎన్నికైనవారే. వారందరికీ డిప్యూటీ చైర్మన్‌‌‌‌ పేరుపేరునా ఆహ్వానం పలికారు.

జీవన్‌‌‌‌ రెడ్డి వర్సెస్‌‌‌‌ మినిస్టర్స్

మున్సిపల్‌‌‌‌ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి జగదీశ్​రెడ్డి, కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నేషనల్‌‌‌‌ బీసీ కమిషన్‌‌‌‌ ను సంప్రదించ లేదని జీవన్‌‌‌‌ రెడ్డి అనడంపై టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్సీలు అభ్యంతరం తెలిపారు. జగదీశ్​రెడ్డి, పల్లా రాజేశ్వర్‌‌‌‌రెడ్డి ఆవేశంగా స్పందించారు. ‘‘బీసీ రిజర్వేషన్లు చేసేటప్పుడు నేషనల్‌‌‌‌ బీసీ కమిషన్‌‌‌‌ను సంప్రదించాలా? సుప్రీంకోర్టు కేసును కొట్టేశాక బీసీ కమిషన్‌‌‌‌ తో ఏం పనుంది. జీవన్‌‌‌‌ రెడ్డి.. సభను తప్పుదారి పట్టిస్తున్నారు. బీసీలకు కాంగ్రెస్‌‌‌‌ ఏం చేసింది..” అని జగదీశ్​రెడ్డి మండిపడ్డారు. తర్వాత కూడా వాగ్వాదం జరిగింది. మంత్రి, అధికారపక్ష సభ్యుల తీరును నిరసిస్తూ.. జీవన్​రెడ్డి వాకౌట్‌‌‌‌ చేశారు.