ఆహా ఏమి రుచి..! వరల్డ్ టాప్ ఫుడ్ సిటీల లిస్ట్‌లో హైదరాబాద్

ఆహా ఏమి రుచి..! వరల్డ్ టాప్ ఫుడ్ సిటీల లిస్ట్‌లో హైదరాబాద్
  • టేస్ట్ అట్లాస్‌లో భారతీయ నగరాలకు చోటు
  • ముంబైకి 35, హైదరాబాద్‌కు 39వ ర్యాంక్
  • 56 ప్లేస్ లో ఢిల్లీ, చెన్నైకి 65, లక్నోకు 92వ స్థానం
  • ఫస్ట్ ప్లేస్‍లో నిలిచిన రోమ్ నగరం

ఢిల్లీ: మన వంటలకు ప్రపంచం ఫిదా అవుతోంది. ఆహా ఏమి రుచీ అంటూ లొట్టలేసుకు తినేస్తున్నారు భోజన ప్రియులు. టేస్ట్ ఫుడ్ అట్లాస్ లో మన హైదరాబాద్ చోటు దక్కించుకున్నది. మన బిర్యానీ అంటే యమ క్రేజ్.. మహామహులు సైతం రుచి చూడకుండా ఉండలేరు. ప్రపంచంలోని చాలా నగరాలు.. భోజన ప్రియులును తెగ ఆకట్టుకుంటుంటాయి. ప్రపంచంలోనే బెస్ట్ ఫుడ్ నగరాల విషయంలో టేస్ట్ అట్లాస్ తాజాగా ఓ జాబితాను విడదల చేసింది. టాప్ 50లో చోటు దక్కించుకున్న రెండు భారతీయ నగరాలు.  ముంబై , హైదరాబాద్ వరుసగా 35వ మరియు 39వ స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ 56వ స్థానంలో ఉండగా, చెన్నై, లక్నో 65, 92 స్థానాల్లో నిలిచాయి. 

ఢిల్లీ, ముంబై వివిధ రకాల చాట్‌లకు ప్రసిద్ధి చెందినప్పటికీ, హైదరాబాద్ బిర్యానీకి, చెన్నై దాని రుచికరమైన దోస మరియు ఇడ్లీలకు ప్రసిద్ధి చెందింది. లక్నో కబాబ్‌లు & బిర్యానీలతో కూడిన ముగ్లాయ్ వంటకాలకు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ కారణంగా ఐదు భారతీయ నగరాలు టాప్ వంద స్థానాల్లో నిలిచాయి.  జాబితాలో అగ్రస్థానంలో ఉంది రోమ్ (ఇటలీ), ఇది తాజా పదార్ధాలతో టేస్టీ, హార్ట్ ఫుల్  వంటకాలకు ప్రసిద్ధి చెందింది. బోలోగ్నా, నేపుల్స్ వరుసగా 2,3 స్థానాల్లో నిలిచాయి. ఈ మూడు ఇటాలియన్ నగరాలు పాస్తా, పిజ్జా , జున్నుతో చేసిన వంటకాలకు ప్రసిద్ధి. 

టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్న ఇతర నగరాలు - వియన్నా (ఆస్ట్రియా), టోక్యో (జపాన్), ఒసాకా (జపాన్), హాంకాంగ్ (చైనా), టురిన్ (ఇటలీ), గాజియాంటెప్ (టర్కీ), బాండుంగ్ (ఇండోనేషియా), పోజ్నాన్ (పోలాండ్), శాన్ ఫ్రాన్సిక్సో (అమెరికా), జెనీవా (స్విట్జర్లాండ్), మకాటి (ఫిలిప్పీన్స్) ఉన్నాయి. ముంబై, హైదరాబాద్, చెన్నయ్, ఢిల్లీ, లక్నో నగరాల విషయానికి వస్తే, ప్రజలు పావ్ భాజీ, దోస, వడ పావ్, చోలే భాతురే, కబాబ్స్, నిహారీ, పానీ పూరీ, చోలే కుల్చే, బిర్యానీ, వివిధ రకాల చాట్‌లను ఇష్టపడతారు.