మావోయిస్టులమంటూ వసూళ్లు చేస్తున్న  ఐదుగురు అరెస్ట్‌‌‌‌‌‌‌‌

మావోయిస్టులమంటూ వసూళ్లు చేస్తున్న  ఐదుగురు అరెస్ట్‌‌‌‌‌‌‌‌

భూపాలపల్లి రూరల్, వెలుగు : మావోయిస్టులమంటూ బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఐదుగురు వ్యక్తులను భూపాలపల్లి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సురేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి శనివారం వెల్లడించారు. మహదేవ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ మండలం అంబటిపల్లికి చెందిన వావిళ్ల జనార్దన్‌‌‌‌‌‌‌‌ గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేశాడు. లొంగిపోయిన అనంతరం భూపాలపల్లి మండలం ఆజంనగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన పులిగాని సతీశ్‌‌‌‌‌‌‌‌, బీరెల్లి నరసయ్య, ములుగు జిల్లా బండారుపల్లికి చెందిన పెండెం రాజేంద్రప్రసాద్, తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన ఆలం సమ్మయ్యతో కలిసి వసూళ్ల దందాకు తెరలేపారు.

ఇందులో భాగంగా రూ. 50 లక్షలు ఇవ్వాలంటూ కాళేశ్వరం సర్పంచ్ భర్త వెన్నపురెడ్డి మోహన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, భూపాలపల్లి మండలం నాగారం సర్పంచ్‌‌‌‌‌‌‌‌ పిన్‌‌‌‌‌‌‌‌రెడ్డి రాజిరెడ్డిని బెదిరించారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేశారు. శనివారం కాళేశ్వరంలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు వారు కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కారు, పల్సర్‌‌‌‌‌‌‌‌ బైక్‌‌‌‌‌‌‌‌, రెండు డమ్మీ పిస్టల్స్, నాలుగు జిలిటెన్‌‌‌‌‌‌‌‌ స్టిక్స్, ఐదు మొబైల్‌‌‌‌‌‌‌‌ ఫోన్స్‌‌‌‌‌‌‌‌ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఎస్పీ వెంట కాటారం డీఎస్పీ జి. రామ్మోహన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, భూపాలపల్లి డీఎస్పీ రాములు, మహదేవ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ సీఐ కిరణ్, ఎస్సై భవానీసేన్‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.