తలపై బుల్లెట్ గాయాలతో..ఒకే గదిలో ఐదు మృతదేహాలు

తలపై బుల్లెట్ గాయాలతో..ఒకే గదిలో ఐదు మృతదేహాలు
  • తలపై బుల్లెట్​ గాయాలతో..ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
  • ఉత్తరప్రదేశ్ సహారన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఘోరం
  • డెడ్ బాడీల పక్కన మూడు గన్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

లక్నో: ఉత్తరప్రదేశ్ సహారన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సర్సావా పరిధిలోని కౌశిక్ విహార్ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తలపై బుల్లెట్స్ గాయాలతో మృతి చెందారు. మృతులను అశోక్ రాఠీ (40) అనే ల్యాండ్ సర్వేయర్, ఆయన భార్య అజంతా (37), తల్లి విద్యావతి (70), కుమారులు కార్తీక్ (16), దేవ్ (13)గా పోలీసులు గుర్తించారు. 

కౌశిక్ విహార్ కాలనీలోని ఓ ఇంట్లో ఐదుగురు చనిపోయినట్లు మంగళవారం ఉదయం స్థానికుల నుంచి సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించగా.. ఒకే గదిలో మృతదేహాలు లభ్యమయ్యాయన్నారు. అశోక్ రాఠీ డెడ్ బాడీ పక్కన బుల్లెట్స్ తో లోడ్ చేసిన మూడు గన్స్ దొరికాయని వెల్లడించారు. మరణించిన వారందరికి తలలపైనే బుల్లెట్స్ గాయాలు ఉన్నాయని, చాలా దగ్గరి నుంచి కాల్పులు జరిగినట్లు వివరించారు. 

ఫోరెన్సిక్ బృందం ఆధారాలను సేకరిస్తున్నదన్నారు. స్వాధీనం చేసుకున్న గన్స్ కు లైసెన్స్ ఉందా లేదా అని నిర్ధారించే ప్రాసెస్ కొనసాగుతున్నదన్నారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ప్రకారం.. తండ్రి మరణం తర్వాత అశోక్ కారుణ్య పద్ధతిలో ల్యాండ్ సర్వేయర్ ఉద్యోగం పొందారని పోలీసులు తెలిపారు. 

మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు అశోక్ తన బంధువు ఒకరికి వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో "ముఝ్సే బహుత్ బడీ గల్తీ హో గయీ(నేను చాలా పెద్ద తప్పు చేశాను)" అనే వాయిస్ నోట్ పంపినట్లు సమాచారం. పోలీసులు దీన్ని కీలక సాక్ష్యంగా పరిగణిస్తున్నారు. అశోక్ తన కుటుంబ సభ్యులను తుపాకీతో కాల్చి చంపి, తర్వాత తాను సూసైడ్​ చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.