మెదక్ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

మెదక్ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి
  • అత్తింటి వేధింపులకు మహిళ సూసైడ్​
  • కారు బైక్ ఢీకొని జూనియర్ అసిస్టెంట్..
  • తేనెటీగల దాడిలో ఒకరు.. 
  • బైక్ అదుపుతప్పి వ్యక్తి..  

  పుల్కల్, వెలుగు: అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో గురువారం జరిగింది. ఎస్ఐ పాటిల్ క్రాంతికుమార్ కథనం ప్రకారం.. ఆందోల్ మండలం సంగుపేట గ్రామానికి చెందిన కావేరి (23)ని పది నెలల కింద చౌటకూర్ మండల కేంద్రానికి చెందిన పోచయ్య (26)తో వివాహం జరిపించారు. పెళ్లి జరిగిన నెలలకే గర్భస్రావం జరిగింది. 15 రోజుల కింద  రెండో సారి గర్భవతి కావడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించారు.

శిశువుకు హృదయ స్పందన లేదని  గర్భస్థ శిశువును తీసివేయాలని వైద్యులు సూచించారు. దీనికి తోడు భర్త, అత్తమామలు వరకట్నం ఇవ్వాలని మానసికంగా వేధింపులకు గురి చేయడంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన భర్త సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తల్లి భూమమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

కారు బైక్ ఢీకొని జూనియర్ అసిస్టెంట్..  

కౌడిపల్లి, వెలుగు: కారు బైక్ ఢీకొన్న ప్రమాదంలో జూనియర్ అసిస్టెంట్ మృతి చెందాడు. ఈ ఘటన గురువారం కౌడిపల్లి మండల కేంద్రం సమీపంలో జరిగింది. కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ నబీ (25) మెదక్ ఆర్డీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తాడు. రోజు మాదిరిగానే డ్యూటీకి హాజరయ్యేందుకు బైక్ పై మెదక్ వెళ్తుండగా వెనకాలే వస్తున్న కారు ఢీకొనడంతో అబ్దుల్ నబీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లయిన ఆరు నెలలకే అబ్దుల్ నబీ మృతి చెందడంతో కుటుంబం, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

తేనెటీగల దాడిలో వ్యక్తి.. 

సిద్దిపేట రూరల్, వెలుగు: తేనెటీగల దాడిలో ఒకరు మృతి చెందిన ఘటన సిద్దిపేట రూరల్ మండలం చింతమడక ఆమ్లెట్ విలేజ్ అంకంపేటలో జరిగింది. ఎస్ఐ అపూర్వ రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ముత్యాల తిరుపతి (55) వ్యవసాయంతో పాటు గొర్రెలను కాస్తూ జీవించేవాడు. గురువారం ఉదయం గొర్రెలను మేపడానికి పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో పక్క పొలంలోని చింత చెట్టుకు ఉన్న తేనెటీగలు అతడి పై దాడి చేశాయి. విషయం తెలుసుకున్న తిరుపతి కొడుకు రాజు అతడిని  సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా పరీక్షించిన డాక్టర్లు మరణించినట్లు తెలిపారు. మృతుడి కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

బైక్ అదుపుతప్పి ఒకరు..  

 బైక్ అదుపుతప్పి రోడ్డు డివైడర్ కు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన సిద్దిపేట రూరల్ పీఎస్​పరిధిలో జరిగింది. ఎస్ఐ అపూర్వరెడ్డి కథనం ప్రకారం.. సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన శివరాత్రి బాలకృష్ణ (36) కూలీ పనులు చేస్తూ బతికేవాడు. రోజులాగే పనికి వెళ్లిన బాలకృష్ణ సిద్దిపేట నుంచి బుధవారం రాత్రి రామచంద్ర నగర్ కు వస్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు అతన్ని సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. మృతుడి తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

దంపతుల ఆత్మహత్యాయత్నం ..చికిత్స పొందుతూ భర్త మృతి 

శివ్వంపేట, వెలుగు: దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. మెదక్​జిల్లా శివ్వంపేట మండలం పోతులబొగుడ గ్రామానికి చెందిన పందుల శివ కుమార్, శోభ దంపతులు గత మంగళవారం పాపన్న పేట మండలంలోని ఏడుపాయల దేవస్థానం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వారి  కూతురు పెళ్లి పది రోజుల కింద  జరిగింది.  అమ్మాయి మైనర్ కావడంతో గుర్తు తెలియని వ్యక్తులు స్త్రీ శిశు సంక్షేమ అధికారులకు సమాచారం ఇవ్వడంతో బాలికను మెదక్ లోని బాలికల సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు.

ఈ క్రమంలో మంగళవారం కూతురిని చూడడానికి  తల్లిదండ్రులు వెళ్లగా అధికారులు బాల్య వివాహాలు చేయడం నేరమని మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో మనస్తాపానికి గురై ఇద్దరు  మెదక్ లో పురుగుల మందు కొనుగోలు చేసి ఏడుపాయల ఆలయం వద్దకు వెళ్లి తాగారు. విషయం తెలుసుకున్న బంధువులు 108 కు ఫోన్ చేయడంతో వారిని మెదక్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగ అక్కడ చికిత్స పొందుతూ గురువారం శివకుమార్ మృతి చెందాడు. అతడి భార్య చికిత్స పొందుతోంది.