షైన్ ఆస్పత్రి ఘటనలో ఐదుగురు అరెస్ట్

షైన్ ఆస్పత్రి ఘటనలో ఐదుగురు అరెస్ట్
  • యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని తేల్చిన పోలీసులు

ఎల్ బీ నగర్, వెలుగు:షైన్ ఆస్పత్రి ఘటనలో ఐదుగురు నిందితులను ఎల్ బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్పత్రి యాజమాని తో పాటు అందులో పనిచేస్తున్న సిబ్బంది వరకు నిర్లక్ష్యం ఉన్నట్లు తేల్చారు. ఆస్పత్రి నిర్వహించేటప్పుడు కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత యజమానిపై ఉంటుందని ఆస్పత్రికి కావాల్సిన  ఎలాంటి పర్మిషన్స్ లేకపోవడమే కాకుండా ఆస్పత్రి నిర్వహణలో యజమాని సునీల్ కుమార్ రెడ్డి నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించారు.  ఘటన జరిగిన సమయంలో పిల్లల వైద్యుడు హరికృష్ణ పిల్లలను కాపాడడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు.

డ్యూటీలో ఉన్న నర్సు లేనట్లే

ఘటన జరిగిన సమయంలో ఎన్ఐసీయూలో ఆస్పత్రి సిబ్బంది కానీ వైద్యులు కానీ ఒక్కరు కూడా ఎవ్వరు లేరని పోలీసులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 1.57కు ఎన్ఐసీయూలో నుంచి డోర్లు దగ్గరకు వేసి బయటకు వెళ్లిన డ్యూటీ నర్సు స్రవంతి మళ్లీ తిరిగి రాలేదు. పక్కనే ఉన్న  పీఐసీయూ లో ఉన్న దీపిక అనే నర్సు కూడా స్పందించలేదు. దీంతో పాటు కొంతమేరకు బాధ్యత ఉన్న ఎలక్ట్రీషియన్ బషీర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.