
ఈ రోజుల్లో చాయ్ తాగాలన్నా ఆరేడు రూపాయలు కావాల్సిందే.. కానీ కేవలం ఐదు రూపాయలకే కమ్మనైన కూరలతో అన్నం పెడుతూ రోజుకు 40 వేల మంది ఆకలి తీరుస్తోంది జీహెచ్‌ఎంసీ. జంట నగరాల్లో ఏ మూలకు వెళ్లినా అన్నం దొరికేలా ప్లాన్ చేసి పేదల కడుపు నింపుతోంది.
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ, హరేకృష్ణ మూవ్‌మెంట్ సంయుక్తంగా జంట నగరాల్లో అమలు చేస్తున్న ఐదు రూపాయల భోజన పథకానికి విశేష స్పందన లభిస్తోంది. జంట నగరాల్లో 150 చోట్ల ఈ పథకం అమలవుతోంది. ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రోజూవారీ కూలీలు, నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని 2014 మార్చిలో అప్పటి జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ , మేయర్ మాజిద్ హుస్సేన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఒక్కరి భోజనానికి రూ.24.25 ఖర్చవుతుండగా.. ఇందులో కేవలం లబ్ధిదారుడు రూ.5 చెల్లిస్తేచాలు వేడివేడి అన్నం, కమ్మని కూరలతో భోజనం పెడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు ఈ కేంద్రాలు తెరిచి ఉంటాయి. ఇందుకు సంబంధించిన ఏవైనా సలహాలు, సందేహాల నివృత్తి చేసుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్ 040-21111111 కూడా ఏర్పాటు చేశారు.
నార్సింగ్ లో వంటశాల
ఐదు రూపాయలకు 450 గ్రాముల అన్నంతోపాటు ఒక వాటర్ ప్యాకెట్, 100 గ్రాముల పప్పు, 150 గ్రాముల ఒక కూర, ఒక చట్నీ, సాంబారు అందిస్తున్నారు. నగరంలో ఏ ప్రాంతానికి వెళ్లినా ఐదు రూపాయల భోజనం అందుబాటులో ఉండేలా ప్లాన్ తో జంటనగరాల్లో 150 కేం ద్రాలను ఏర్పాటుచేశారు. అన్ని కేంద్రాల్లోనూ మంచి స్పందన వస్తోందని హరేకృష్ణ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ప్రారంభంలో 50 సెంటర్ల ద్వారా రోజుకు వెయ్యి మంది ఆకలి తీర్చగా, ఇప్పుడు 150 సెంటర్ల ద్వారా సుమారుగా 40 వేలమంది పేదల ఆకలి తీరుస్తోంది. వంట కోసం నగర శివారులోని నార్సింగిలో భారీ వంటశాలను నిర్మించారు. ఉదయం 11.30 గంటలకు అక్కడి నుంచి బయల్దేరే వాహనాలు మధ్యాహ్నం 12 గంటలకల్లా అన్ని కేంద్రాలకు చేరుకుంటాయి. 12 గంటల నుంచి ఒంటిగంట వరకు వేడివేడి భోజనం, కూరలు వడ్డించేస్తారు. పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు పలువురు ప్రముఖులు సైతం ఐదు రూపాయల అన్నంతిని ప్రశంసించారు.