వీడిన మేడిపల్లి మర్డర్ మిస్టరీ

 వీడిన మేడిపల్లి మర్డర్ మిస్టరీ

గత నెల 30న మేడిపల్లిలో జరిగిన యువకుడి హత్య కేసును మేడిపల్లి పోలీసులు ఛేదించారు. హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న ఐదుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ సందీప్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉప్పల్ చిలుకానగర్ కు చెందిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు అర్జున దయానంద్(25), బోడుప్పల్ కు చెందిన గొల్లపల్లి శివకుమార్(19), మేడ్చల్ జిల్లా రాంపల్లికి చెందిన అర్కల వంశీధర్ రెడ్డి(22), బోడుప్పల్ కు చెందిన కేతావత్ కమల్ కిశోర్(21), హేమానగర్ కి చెందిన తూరుపాటి దినేశ్​(20) ఈ ఐదుగురు ఫ్రెండ్స్. వీరిలో దయానందర్, వంశీధర్ రెడ్డి గతంలో పలు చోరీలు చేయగా..వారిపై ఉప్పల్, మేడిపల్లి పీఎస్ పరిధిలో కేసులు నమోదయ్యాయి. ఈ ఐదుగురిలో శివకుమార్ కి బాబాసాయి అలియాస్ కట్టెలసాయి(21) అనే మరో ఫ్రెండ్ ఉన్నాడు. 4 నెలల క్రితం శివకుమార్..బాబాసాయిని తన మిగతా ఫ్రెండ్స్ కి పరిచయం చేశాడు. వీరందరూ గంజాయి, మద్యానికి బానిసయ్యారు. బాబాసాయి ఫ్రెండ్స్ ప్రవీణ్ అలియాస్ చిన్నా, సుందర్ ను 2018 డిసెంబర్ లో ఉప్పల్ పోలీసులు గంజాయి కేసులో అరెస్టు చేసి జైలుకి పంపారు. ప్రవీణ్, సుందర్ గంజాయి అమ్ముతున్నారని శివకుమార్ ద్వారా పరిచయమైన అర్జున దయానంద్ పోలీసులకు సమాచారం అందించాడని..అందుకే వారు జైలుకి వెళ్లారని బాబాసాయి నిర్ధారించుకున్నాడు. ప్రవీణ్, సుందర్ ని జైలుకి పంపిన దయానంద్ కామన్  ఫ్రెండ్స్ గ్రూప్ తో ఎప్పుడు కనిపించినా బాబాసాయి అతడిని తిట్టేవాడు. దీంతో దయానంద్..బాబాసాయిపై కక్ష పెంచుకున్నాడు. బాబాసాయిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్న దయానంద్ ఈ విషయాన్ని తన మిగతా నలుగురు ఫ్రెండ్స్ కి చెప్పాడు. ముందస్తు ప్లాన్ లో భాగంగా గత నెల 30న దయానంద్, అరకల వంశీధర్ రెడ్డి బోడుప్పల్ లోని బాబాసాయి ఇంటికి వెళ్లి పార్టీ చేసుకుందామని బైక్ పై శివకుమార్ ఇంటికి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ శివకుమార్, దినేశ్, కమల కిశోర్..వీరి కోసం ఎదురు చూస్తున్నారు. బాబాసాయి, దయానంద్, వంశీధర్ రాగానే అందరూ కలిసి తాగడం మొదలుపెట్టారు. తమ ప్లాన్ లో భాగంగా వీరు బాబాసాయికి ఎక్కువ మద్యం తాగించారు. ఆ తర్వాత దయానంద్..బాబాసాయితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో పక్కనే ఉన్న బీర్ బాటిల్ తో దయానంద్..బాబాసాయి తలపై బలంగా కొట్టాడు. తర్వాత పగిలిపోయిన బాటిల్ తో బాబాసాయి పొట్టలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాబాసాయిని వంశీధర్, కమల్ కిశోర్ బైక్ పై అతడి ఇంటిదగ్గరికి తీసుకెళ్లి పడేసి పరారయ్యారు. బాబాసాయి అపస్మారక స్థితిలో ఉండటాన్ని చూసిన ఆయన సోదరుడు వెంటనే బోడుప్పల్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తరలించాడు. అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. బాబాసాయి ట్రీట్ మెంట్ తీసుకుంటూ అదే రోజు చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాబాసాయిని హత్య చేసి తప్పించుకుతిరుగుతున్న ఐదుగురు దయానందర్, శివకుమార్, కమల్ కిశోర్, వంశీధర్ రెడ్డి, దినేశ్​ను శుక్రవారం అరెస్టు చేశారు. నిందితులపై 302,141,114,149,120-బీ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన మేడిపల్లి పోలీసులు బైక్ స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్​కు తరలించారు.