రుద్రప్రయాగ్: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్‌నాథ్ హైవేపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు యాత్రికులు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సోమవారం రాత్రి సోన్‌ప్రయాగ్, ముంకతియా మధ్య ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల కింద మరికొంత మంది యాత్రికులు చిక్కుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేదార్‌నాథ్‌ను సందర్శించి తిరిగి వస్తున్న యాత్రికుల బృందంపై సోమవారం రాత్రి 7.20 సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి.
శిథిలాల కింద చిక్కుకుపోయిన యాత్రికులను రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) ప్రమాద స్థలంలో సహాయ, రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొన్నాయి. రాత్రి కావడంతో సహాయ చర్యలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. మంగళవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ వేగవంతంగా కొనసాగింది. మొత్తం ఐదుగురి మృతదేహాలు వెలికి తీశారు.