పోలవరం బ్యాక్‌‌‌‌‌‌‌‌వాటర్‌‌‌‌తో భద్రాచలానికి ముప్పు.. ఏపీలో కలిసిన ఐదు గ్రామాలను తెలంగాణకు అప్పగించాలి

పోలవరం బ్యాక్‌‌‌‌‌‌‌‌వాటర్‌‌‌‌తో భద్రాచలానికి ముప్పు.. ఏపీలో కలిసిన ఐదు గ్రామాలను  తెలంగాణకు అప్పగించాలి
  • కేంద్రమే సమస్యను పరిష్కరించాలి..
  • రాజ్యసభ సీపీఎం ఫ్లోర్‌‌‌‌ లీడర్‌‌‌‌ జాన్‌‌‌‌ బ్రిటాస్​ 

భద్రాచలం, వెలుగు : పోలవరం ప్రాజెక్ట్‌‌‌‌ కారణంగా గోదావరి నదీ ప్రవాహం వెనక్కు వస్తుందని, దీని వల్ల భద్రాచలం పట్టణంతో పాటు పరిసర గ్రామాలకు ముప్పు పెరిగిందని రాజ్యసభ సీపీఎం ఫ్లోర్‌‌‌‌ లీడర్‌‌‌‌ జాన్‌‌‌‌ బ్రిటాస్‌‌‌‌ చెప్పారు. సీపీఎం డివిజన్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు.

 గోదావరి వరద ప్రతీ ఏటా భద్రాచలం పట్టణాన్ని ముంచెత్తుతోందన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌‌‌‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వరదల తీవ్రత పెరగనుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం కాపర్‌‌‌‌ డ్యాం వల్ల ముంపు మండలాల్లో పలు ఇండ్లు మునిగిపోయాయన్నారు. పోలవరం బ్యాక్‌‌‌‌ వాటర్‌‌‌‌ కారణంగా భద్రాచలం పట్టణానికే కాకుండా, ప్రజల ప్రాణాలకు సైతం ముప్పు పొంచి ఉందని, కేంద్రం స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని ఖోరారు. 

 పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌‌‌‌గా కేంద్రం గుర్తించినందున, దాని వల్ల కలిగే ప్రతి సమస్యకు కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. ఈ ప్రాజెక్ట్‌‌‌‌ కారణంగా ముంపు ప్రాంతాలు పెరుగుతున్నాయన్నారు. ప్రాజెక్ట్‌‌‌‌ వ్యయభారం, పునరావాస పరిహారం, రక్షణ గోడల నిర్మాణం అన్నీ కేంద్రమే చూసుకోవాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ఆంధ్రాలో విలీనమైన కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకులపాడు, ఎటపాక, పురుషోత్తపట్నం గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణకు అప్పగించాలని కోరారు. 

స్వాతంత్ర్య వేడుకల్లో ప్రధాని మోదీ ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ను పొగడడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని, ఇది దేశ ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుందన్నారు. మోదీ, ట్రంప్‌‌‌‌ స్నేహితులైతే భారత్‌‌‌‌పై సుంకాలు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌‌‌‌రావు, భద్రాద్రికొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, అన్నవరపు కనకయ్య, ఏజే.రమేశ్‌‌‌‌, కారం పుల్లయ్య, బాలనర్సారెడ్డి, గడ్డం స్వామి, బండారు శరత్‌‌‌‌బాబు, ఎలమంచి వంశీకృష్ణ, వైవీ.రామారావు పాల్గొన్నారు.