
- నాయకత్వ మార్పుపై చర్చల్లేవ్
- కేబినెట్ విస్తరణపై నిర్ణయం తీసుకోలేదని వెల్లడి
న్యూఢిల్లీ: సీఎం పదవి ఖాళీ లేదని, ఐదేండ్ల పాటు పూర్తి టర్మ్ తానే సీఎంగా ఉంటానని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. నాయకత్వ మార్పు జరుగుతుందన్న ఊహాగానాలను ఆయన కొట్టివేశారు. గురువారం బెంగళూరులో మీడియాతో సిద్దు మాట్లాడారు. సీఎం పదవి ఖాళీగా లేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా స్పష్టం చేశారని గుర్తుచేశారు.
సీఎం పదవి నుంచి తనను దించేస్తారన్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ ఊహాగానాలేనని చెప్పారు. ఈ విషయాన్ని కర్నాటక కాంగ్రెస్ ఇన్ చార్జి రణ్ దీప్ సుర్జేవాలా ఇదివరకే స్పష్టం చేసి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ‘‘నాయకత్వ మార్పు లేదని సుర్జేవాలా స్పష్టంగా చెప్పారు. ఆ విషయంపై చర్చ కూడా లేదు. కర్నాటక ఇన్ చార్జే ఈ విషయం చెప్పినపుడు మళ్లీ ఊహాగానాలెందుకు? మీడియా ఈ విషయంపై అనవసరంగా ఊహాగానాలకు తావిస్తున్నది. నాయకత్వ మార్పుపై పార్టీలో కూడా చర్చ లేదు.
హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ డెసిషన్. ఇందుకు మేము ఇదివరకే ఒప్పుకున్నాం” అని సీఎం వ్యాఖ్యానించారు. అధికార పంపిణీపై చర్చలు జరుగుతున్నాయా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ప్రభుత్వం రెండున్నరేండ్లు పూర్తి చేసుకున్నపుడు అలాంటి ఇష్యూలు తెరమీదకు రావడం సహజమేనని సిద్దు చెప్పారు. వాస్తవానికి అలాంటి ఒప్పందమే లేదన్నారు.
అధికార పంపిణీ ఒప్పందమే ఉండుంటే, ఐదేండ్ల వరకు తానే సీఎంనని తాను చెప్పి ఉండేవాడినే కాదన్నారు. ఎవరైనా వారి వ్యక్తిగత అభిప్రాయం చెప్పినంత మాత్రాన, అది పార్టీ నిర్ణయం కాలేదన్నారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపైనా ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.