ఐదేండ్లుకాపు కాసి..ఆరుసార్లు విఫలమై..పక్కా ప్లాన్‌‌‌‌‌‌‌‌ తో మధు మర్డర్‌‌‌‌‌‌‌‌..సూర్యాపేటలోBRS లీడర్మధు హత్య

ఐదేండ్లుకాపు కాసి..ఆరుసార్లు విఫలమై..పక్కా ప్లాన్‌‌‌‌‌‌‌‌ తో మధు మర్డర్‌‌‌‌‌‌‌‌..సూర్యాపేటలోBRS లీడర్మధు హత్య
  • సూర్యాపేటలో మూడు రోజుల కింద బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకుడు మధు హత్య
  • 2007లో జరిగిన రవీందర్‌‌‌‌‌‌‌‌ హత్యకు ప్రతీకారంగానే మధును చంపిన జీవన్‌‌‌‌‌‌‌‌
  • ఐదుగురిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసిన పోలీసులు

సూర్యాపేట, వెలుగు : ఇరవై ఏండ్ల కింద జరిగిన ఓ హత్యకు ప్రతీకారంగానే సూర్యాపేటలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకుడు మధు హత్య జరిగినట్లు ఎస్పీ నర్సింహ చెప్పారు. ఐదేండ్లు కాపుకాసిన నిందితులు.. ఆరు సార్లు విఫలమై.. చివరకు పక్కా ప్లాన్‌‌‌‌‌‌‌‌తో హత్య చేశారని వెల్లడించారు. సూర్యాపేట మండలం యర్కారం గ్రామానికి చెందిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకుడు చింతలపాటి మధు హత్య కేసును పోలీసులు ఛేదించారు.

 ఈ హత్యలో మొత్తం ఆరుగురు పాల్గొనగా.. ఐదుగురిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసి, హత్యకు ఉపయోగించిన కత్తి, కారు, బైక్‌‌‌‌‌‌‌‌, ఐదు సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సూర్యాపేట ఎస్పీ సోమవారం వెల్లడించారు. యర్కారం సర్పంచ్‌‌‌‌‌‌‌‌ మిద్దె రవీందర్‌‌‌‌‌‌‌‌ 2007లో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో చింతలపాటి మధు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 

దీంతో రవీందర్‌‌‌‌‌‌‌‌ కుమారుడు జీవన్‌‌‌‌‌‌‌‌ మధుపై కక్ష పెంచుకున్నాడు. ఇటీవల కోర్టు కేసును కొట్టేయడం, మధు తనను సైతం చంపేస్తాడన్న భయంతో జీవన్‌‌‌‌‌‌‌‌ ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో తానే మధును హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. 

తన స్నేహితులను పంపి...

మధును హత్య చేసేందుకు నిర్ణయించుకున్న జీవన్‌‌‌‌‌‌‌‌ ఐదేండ్ల కింద తన స్నేహితులైన చింత సైదులు, మేదరి ప్రసాద్‌‌‌‌‌‌‌‌ను మధు వద్దకు పంపించాడు. వారు మధుకు నమ్మకస్తులుగా మారిపోయారు. ఈ ఐదేండ్లలో మధును హత్య చేసేందుకు ఆరు సార్లు ప్రయత్నించి విఫలం అయ్యారు. అయినా సమయం కోసం వేచి ఉన్నారు. 

మధు కదలికలపై నిరంతరం నిఘా పెట్టారు. మధు ఎప్పుడు ఎక్కడ ఉంటాడు ? ఏ సమయంలో ఒంటరిగా దొరుకుతాడు అనే వివరాలు సేకరించారు. ఈ నెల 22న చేపలు, మందు దావత్‌‌‌‌‌‌‌‌ ఉందని చెప్పి మధును సైదులు, ప్రసాద్‌‌‌‌‌‌‌‌ కలిసి తాళ్లగడ్డలోని ఇంటికి పిలిచారు. మందు తాగిన అనంతరం మధు మత్తులో ఉండగా... జీవన్‌‌‌‌‌‌‌‌కు సమాచారం ఇవ్వడంతో ఆనంద్‌‌‌‌‌‌‌‌  అనే వ్యక్తితో కలిసి వచ్చాడు.

 ఇంట్లోకి వెళ్లిన ప్రసాద్‌‌‌‌‌‌‌‌.. మధు చేతులు, కాళ్లు పట్టుకోగా సైదులు, జీవన్‌‌‌‌‌‌‌‌ అప్పటికే సిద్ధం చేసుక్ను కత్తితో మధుపై విచక్షణారహితంగా దాడి చేయడంతో మధు చనిపోయాడు. అనంతరం డెడ్‌‌‌‌‌‌‌‌బాడీని గోనె సంచిలో కట్టి కారులో తీసుకెళ్లి యర్కారం శివారులోని కల్వర్టు కింద పడేశారు. 

మధు బైక్‌‌‌‌‌‌‌‌ను ఓ చోట వదిలేసి, హత్యకు ఉపయోగించిన కత్తి, సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ను అడివెంల సమీపంలోని కాల్వలో పడేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడైన జీవన్‌‌‌‌‌‌‌‌తో పాటు చింత సైదులు, మేదరి ప్రసాద్, మిద్దె ఆనంద్, కక్కిరేణి భరత్‌‌‌‌‌‌‌‌చంద్‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేయగా.. చింత సైదులు భార్య ముల్కలపల్లి భవాని పరారీలో ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు.