ఏటా లక్షల్లో ఆర్డర్లు..  ఈసారి కోట్లలో..

ఏటా లక్షల్లో ఆర్డర్లు..  ఈసారి కోట్లలో..

హైదరాబాద్, వెలుగు: 75 ఏండ్ల స్వాతంత్ర్య సంబురాలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. పంద్రాగస్టుకు ముందు వారం, ఆ తర్వాత వారంపాటు జెండా పండుగ వేడుకలు నిర్వహించాలని, ప్రతి ఇంటిమీద జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చాయి. దీంతో జాతీయ జెండాలకు ఫుల్ గిరాకీ ఏర్పడింది. మునుపెన్నడూ లేనివిధంగా ఎక్కువ సంఖ్యలో జెండాల తయారీ జరుగుతోంది. రాష్ట్రంలో ఏటా లక్షల సంఖ్యలో ఉండే జెండాల ప్రొడక్షన్ ఈసారి కోట్లకు పెరిగింది. ఇప్పటికే హైదరాబాద్​, సికింద్రాబాద్​లోని తయారీ దారులకు ఫుల్ ఆర్డర్స్ వస్తున్నాయి. కరోనా వచ్చినప్పటి నుంచి అంతంతమాత్రంగానే నడిచిన జెండాల తయారీ బిజినెస్.. ఇప్పుడు ఊపందుకుందని వ్యాపారులు చెప్తున్నారు. 

ఎంతో మంది మహిళలకు ఉపాధి

జెండాలకు ఆర్డర్స్ పెరుగుతుండటంతో కార్మికులను అదనంగా నియమించి వ్యాపారులు 24 గంటల పాటు పనులు చేయిస్తున్నారు. ఆరెంజ్, గ్రీన్, వైట్ కలర్ క్లాత్​లను సైజ్​లవారీగా కత్తిరించడం, కుట్టడం వంటి పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటి వల్ల వందలాది మంది మహిళలకు ఉపాధి దొరుకుతోంది. కొందరు వ్యాపారులు ఇండ్లలో ఉండే మహిళలకు క్లాత్ అప్పగించి వర్క్ చేయించుకుంటున్నారు. 

నేతన్నకు అండగా.. 

ప్రతి ఇంటిమీద జాతీయ జెండా ఎగురవేయాలని సీఎం కేసీఆర్ ఇదివరకే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో 1.20 కోట్ల జెండాలను తయారీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను కూడా ఆదేశించారు. గద్వాల, నారాయణ పేట్, సిరిసిల్ల,  పోచంపల్లి, భువనగిరి, వరంగల్ తదితర ప్రాంతాల్లోని చేనేత, పవర్​లూమ్​ కార్మికులకు ఆర్డర్లు ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు మహిళా సంఘాలకు, కుట్టు మిషన్ కార్మికులకూ జెండాలు కుట్టే పని అప్పిగించనున్నారు.

ఫుల్ బిజినెస్ అయితున్నది

20 ఏండ్లుగా జెండాల తయారీ బిజినెస్ చేస్తున్న. ఆగస్టు 15, జనవరి 26 కోసం ఏటా 4 లక్షలు తయారు చేస్తున్నం. రెండేండ్ల కింద ఎన్నార్సీ వచ్చినప్పుడు 10 లక్షల జెండాలు అమ్మినం. మళ్లీ ఇపుడు ఫుల్ డిమాండ్ పెరిగింది. కోట్లలో ఫ్లాగ్స్ కావాలని కర్నాటక, యూపీ, బెంగాల్, తమిళనాడు, మహరాష్ట్ర నుంచి ఆర్డర్లు వచ్చినయ్. 500 మంది కార్మికులతో పనిచేయిస్తున్నం. ఇంకా ఆర్డర్స్ వస్తున్నా.. తీసుకోలేకపోతున్నం. 

- ఉస్మాన్, ఎస్కే గ్రూప్ కంపెనీ, మైలార్ దేవులపల్లి, రాజేంద్రనగర్ 

8లక్షల జెండాలకు ఆర్డర్ వచ్చింది

ఎప్పుడూ లేనంత ఆర్డర్ ఈసారి వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహరాష్ట్ర నుంచి ఇప్పటికే 8 లక్షల జెండాలకు ఆర్డర్స్ వచ్చినయ్. 15 రోజుల నుంచి ప్రొడక్షన్ చేస్తున్నం. ఇంకా ఆర్డర్స్ వస్తున్నయి. కరోనాతో 2 ఏండ్లు వ్యాపారం బంద్ అయింది. ఇప్పుడు 75 ఏండ్ల స్వాతంత్ర్య వేడుకలు కలిసొచ్చినయి. స్కూళ్లు, కాలేజీల నుంచి కూడా ఫుల్​గా ఆర్డర్స్ వస్తున్నయ్. 

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- శతీష్ రెడ్డి, విద్య ఆర్ట్స్, నాగోల్