సెల్​ఫోన్లకు బానిస కాకుండా అప్​డేట్​గా ఉండాలె

సెల్​ఫోన్లకు బానిస కాకుండా అప్​డేట్​గా ఉండాలె
  • స్టూడెంట్లు ఫోన్లకు బానిసలు కావొద్దు
  • ఫ్లేమ్ ఆఫ్ ఎంటర్‌‌ప్రెనూర్‌‌షిప్ ప్రోగ్రామ్​లో కలెక్టర్ కర్ణన్ 

తిమ్మాపూర్, వెలుగు : చిన్న చిన్న ఆలోచనలతోనే భారీ విజయాలను సాధించవచ్చని, సెల్​ఫోన్లకు బానిస కాకుండా అప్​డేట్​గా ఉండాలని కరీంనగర్​కలెక్టర్​ఆర్.వి.కర్ణన్ స్టూడెంట్లకు సూచించారు. మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కాలేజీలో టీ హబ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఫ్లేమ్ ఆఫ్ ఎంటర్‌‌ప్రెనూర్‌‌షిప్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో టీ హబ్ ఉండడం, విద్యార్థులను ప్రోత్సహించే విధంగా స్టార్టప్ సంస్థలు అందుబాటులో ఉండడం స్టూడెంట్ల అదృష్టమన్నారు. కొత్త ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. స్టూడెంట్లు సరికొత్త స్టార్టప్స్ తో దేశ పురోభివృద్ధికి తోడ్పడాలన్నారు. కొత్త డిజైన్స్, ప్రోటో టైప్ మోడల్స్ ను ఆవిష్కరించాలని అందుకు ప్రభుత్వ సహకారం ఉంటుందని కలెక్టర్​తెలిపారు. అనంతరం వర్క్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ అధికారి తేజస్విని మాట్లాడుతూ ఫ్లేమ్ ఆఫ్ ఎంటర్‌‌ప్రెనూర్‌‌షిప్ జూన్​ 22న నిజామాబాద్, ఆదిలాబాద్, 23న మహబుబ్​నగర్, వరంగల్, హైదరాబాద్, 24న నల్గొండ, ఖమ్మం, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలలో నిర్వహించామన్నారు. అనంతరం జ్యోతిని వెలిగించి విద్యార్థులు ఉన్నత రంగాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాలేజీ చైర్మన్ సాగర్ రావు, టీ హబ్ ప్రతినిధులు ఆదిత్యా, శరత్, ఫిరోజ్, లతోపాటు కాలేజీ స్టూడెంట్లు పాల్గొన్నారు..

సాధారణ ప్రసవాల్లో మొదటి స్థానంలో నిలపాలి..

కరంనగర్‍ సిటీ: సాధారణ కాన్పులలో కరీంనగర్ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని కలెక్టర్ ఆర్.వి కర్ణన్ కోరారు. నగరంలోని వి -కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో సీజనల్ వ్యాధులు, ‘ఎ షీల్డ్’ యాప్​పై శుక్రవారం నిర్వహించిన ఒకరోజు శిక్షణలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎం, ఆశ నోడల్ పర్సన్స్, అంగన్​వాడీ కార్యకర్తలకు సీజనల్ వ్యాధులు, డెంగీ, మలేరియా, క్షయ నివారణపై అవగాహన కల్పించారు. కరోనా వ్యాక్సినేషన్ మొదటి, రెండో మోతాదులో 100శాతం  పూర్తి చేసి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపినందుకు అభినందనలు తెలిపారు. వ్యాక్సినేషన్ తరహాలోనే సాధారణ కాన్పులలోజిల్లాను మొదటి స్థానంలో నిలపాలన్నారు. సిజేరియన్లతో జరిగే అనర్థాలను తెలియజేస్తూ సాధారణ కాన్పు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడారు. అందరూ ఎ షీల్డ్ యాప్ ను డౌన్​లోడ్ చేసుకోవాలన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి  ప్రశంస పత్రాలు,  బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి ప్రియాంక, జిల్లా వైద్య  ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జువేరియా, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి పాల్గొన్నారు.