ఇక నడిచేదెలా..? ఫుట్ పాత్ లపైనా ఫ్లెక్సీలు, బోర్డులు

ఇక నడిచేదెలా..? ఫుట్ పాత్ లపైనా ఫ్లెక్సీలు, బోర్డులు
  • అమీర్ పేట, ఎస్సార్ నగర్ లో ఫుట్​పాత్​లపై ఫ్లెక్సీలు
  • ట్రాఫిక్ జామ్ ని పట్టించుకోని కోచింగ్ సెంటర్స్ నిర్వాహకులు
  • ఇబ్బంది పడుతోన్న వాకర్స్, వాహనదారులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  ట్విన్ సిటీస్ లోని కీలకమైన బిజినెస్ ఏరియాల్లో అమీర్ పేట ఒకటి. మల్టీఫ్లోర్స్ బిల్డింగ్ లు, షాపింగ్ మాల్స్, ఎలక్ట్రానిక్స్, వస్త్రాభరణాల షోరూంలు ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇక మైత్రివనం ప్రాంతం వివిధ కంప్యూటర్‌‌‌‌ కోర్సుల్లో ట్రైనింగ్ కోసం వచ్చే అభ్యర్థులతో కిటకిటలాడుతుంది. పక్కనే ఉన్న ఎస్సార్‌‌‌‌నగర్‌‌‌‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి. తెలుగు రాష్ట్రాల నుంచే గాక ఇతర రాష్ట్రాల స్టూడెంట్స్  సైతం పలు రకాల కంప్యూటర్‌‌‌‌ కోర్సులు, ఉద్యోగాలు సాధించడానికి అవరసమైన  స్కిల్స్ కోసం ఇక్కడికి వస్తున్నారు. అమీర్ పేట, మైత్రివనం, ఎస్సార్ నగర్ ప్రాంతాల్లో వందల కొద్దీ కోచింగ్ సెంటర్లున్నాయి.  వాటికి సంబంధించిన ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు కోచింగ్‌‌‌‌ సెంటర్ల ఎదురుగా పెడుతున్నారు. వీటిని ఫుట్ పాత్ ల మీద నుంచి  క్రమంగా ఇవి ఆయా వీధుల్లో ఉన్న రహదారులపైకి జరుపుతున్నారు. ఫుట్ పాత్ లు, రహదారుల మీద ఫ్లెక్సీ బోర్డులే కాకుండా షాప్ లు, చిన్న చిన్న  వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. టిఫిన్‌‌‌‌ సెంటర్లు, నిమ్మరసం, చెరుకు రసాల తోపుడు బండ్లు ఇక్కడ వెలుస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌‌‌‌ సమస్యలు ఎదురవుతున్నాయి. వాకర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ లపై ఫ్లెక్సీ బోర్డులు ఉండటంతో వాకర్స్ కి ఇబ్బందిగా మారింది. వీధుల్లో  స్టూడెంట్స్ తో పాటు మిగతా జనం అటుఇటూ రాకపోకలు సాగిస్తుంటారు. కార్లు, ఆటోలు కూడా తిరుగుతుంటాయి. దీంతో అప్పుడప్పుడు ట్రాఫిక్‌‌‌‌ జామ్‌‌‌‌ అవుతోంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటోందని వాహనదారులు చెబుతున్నారు. ఫుట్ పాత్ లను ఆక్రమించుకోవడమే కాకుండా రహదారులపై కూడా కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీలను లోపలికి జరుపుకోవాలని ఎన్నిసార్లు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకి చెప్పినా వారు పట్టించుకోవడం లేదని ఆ మార్గంలో వెళ్లేవారు చెబుతున్నారు. ఈ విషయంలో అధికారులకు కంప్లయింట్ చేసినా వారు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటున్నారు.  వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనాలు ముందుకు కదలని పరిస్థితి.  మైత్రివనంలోని ప్రధాన రహదారుల్లో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది. గల్లీల్లోని దారులు సైతం ఇందుకు మినహాయింపు కాదు. మైత్రివనం,ఎస్సార్ నగర్ వీధుల్లో తలెత్తుతున్న ఈ ఆక్రమణలు, ట్రాఫిక్ సమస్యను నివారించాలని
వాహనదారులు కోరుతున్నారు. ఈ కోచింగ్ సెంటర్లు, వివిధ కంపెనీల ఫ్లెక్సీ బోర్డులు తొలగించి..చిరు వ్యాపారులు రహదారులపైకి రాకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు.

తోపుడు బండ్లను తొలగించాలి

రహదారులను ఆక్రమించిన దుకాణాలు, ఫ్లెక్సీలు, తోపుడు బండ్లను వెంటనే తొలగించాలి. ఈ విషయంలో అధికారులు సీరియస్‌‌‌‌గా వ్యవహరించి పరిస్థితిని చక్కదిద్దాలి. లేకపోతే  రహదారులు మరింతగా ఆక్రమణలకు గురవుతాయి. టూ వీలర్లు కూడా రోడ్డు మీదనే పార్కింగ్‌‌‌‌ చేస్తున్నారు. ఈ సమస్యలను అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం తగదు. వారే సీరియస్‌‌‌‌గా వ్యవహరించి చర్యలు తీసుకోవాలి.   ‑ మోహన్‌‌‌‌, మధురానగర్‌‌‌‌

అధికారులు స్పందించాలి

అమీర్‌‌‌‌పేట, ఎస్సార్ నగర్ వీధుల్లో ట్రాఫిక్‌‌‌‌ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్లు, వివిధ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లు ఈ ప్రాంతాల్లో ఎన్నో ఉన్నాయి. ఈ కోచింగ్ సెంటర్ల ఫ్లెక్సీబోర్డులను ఫుట్ పాత్ లను దాటి రహదారిపై పెడుతున్నారు.  దీనివల్ల వెహికల్స్ రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు అర్థం చేసుకుని ఫ్లెక్సీ బోర్డలను తొలగించాలి. మరోవైపు ఈ ప్రాంతాల్లో చిరు వ్యాపారులు సైతం ఫుట్ పాత్, రహదారిని ఆక్రమిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు కంప్లయింట్ చేసినా ఉపయోగం ఉండటం లేదు. ఈ సమస్యపై అధికారులు స్పందించి వీలైనంత తొందరగా పరిష్కరించాలి.

‑ రవి, అమీర్‌‌‌‌పేట