సిటీలో బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీ ఫ్లెక్సీలు.. 

సిటీలో బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీ ఫ్లెక్సీలు.. 

హైదరాబాద్ నగరంలో ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఫ్లెక్సీలు సిటీ రోడ్లను ముంచేస్తున్నాయి. పోటాపోటీగా రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు ఫ్లెక్సీల్లో పోటీపడుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నడుస్తున్నాయి. ప్రధాని మోడీ సహా అమిత్ షా, నడ్డాతో పాటు పార్టీ కీలక నేతలందరూ హైదరాబాద్ కదిలొస్తున్నారు. సేమ్ టైమ్ బీజేపీ కార్యవర్గ సమావేశాలకు పోటీగా టీఆర్ఎస్ కూడా కార్యక్రమాలు పెట్టుకుంది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వస్తున్నారు. ప్రధాని మోడీ, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఇవాళే బేగంపేట ఎయిర్ పోర్టుకు రానున్నారు. 

దీంతో రెండు పార్టీలు ఫ్లెక్సీల్లో పోటీ పడుతున్నారు. బేగంపేట దగ్గర ఏ రోడ్ చూసినా...రెండు పార్టీల కటౌట్లు, హోర్డింగ్స్ కనబడుతున్నాయి. ఒకదాని వెనక మరొకటి...రెండు పార్టీలు ఫ్లెక్సీలు పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కావాలనే తమ తమ ఫ్లెక్సీలు కనబడకుండా కడుతున్నారని రెండు పార్టీల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మరోవైపు యశ్వంత్ సిన్హాను బేగంపేట ఎయిర్ పోర్టులో ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్ వస్తున్నారు. 

దీంతో గులాబీదండు ఫ్లెక్సీలతో దూకుడుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రే బీజేపీని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తుండటంతో...చిన్న పెద్దా లీడర్లందరూ ఫ్లెక్సీలు పెట్టి...కేసీఆర్ దృష్టిలో పడేలా స్కెచ్ వేసుకుంటున్నారు. ఇప్పటికే సిటీలో ప్రధాన కూడళ్లల్లో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. మెట్రో పిల్లర్లపై దాదాపుగా గులాబీ ఫ్లెక్సీలే కనిస్తున్నాయి. సర్కార్ పథకాలతో పాటు మోడీ వ్యతిరేక ఫ్లెక్సీలు రోడ్లపై పెడుతున్నారు కారు లీడర్లు. దీనికి పోటీగా బీజేపీ లీడర్లు మోడీ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టారు. మొత్తంగా కొన్ని రోజులుగా రెండు పార్టీలు ఫ్లెక్సీ వార్ చేస్తున్నాయి. బేగంపేట ఎపిసోడ్ తో సీన్ కాస్త మరింత ముదిరింది.