గ్రేటర్ లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్

గ్రేటర్ లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్

హైదరాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. బీజేపీ వాళ్లకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ పథకాలతో నగరమంతా హోర్డింగ్స్, ఫ్లెక్సీలతో టీఆర్ఎస్ వాళ్లు నింపేశారు. తమకు సరైన ప్రచారం రావొద్దనే టీఆర్ఎస్ ఈ విధంగా చేస్తోందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 

హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోడీతో  బీజేపీ జాతీయ నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు హైదరాబాద్ రానున్నారు. దీంతో భాగ్యనగరాన్ని మొత్తం కమలమయం చేయాలనుకున్నారు ఆ పార్టీ నేతలు. అయితే.. బీజేపీ నేతలకంటే  ముందే టీఆర్ఎస్ పార్టీ వాళ్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోలతో ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేస్తూ నగరమంతా ఫ్లెక్సీలతో నింపేశారు. ప్రధాని మోడీ పర్యటించే బేగంపేట, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, HICC నోవాటెల్ ప్రాంతాల్లో భారీగా హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ప్రచారం కోసం యాడ్ ఏజెన్సీలను బీజేపీ సంప్రదించడంతో హోర్డింగ్స్ అన్నీ టీఆర్ఎస్ ముందుగానే బుక్ చేసుకుందని వెల్లడించాయి. తమ హోర్డింగ్స్ కు చాన్స్ ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం ఇలా ప్లాన్ చేసిందంటున్నారు బీజేపీ నేతలు.

మరోవైపు బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర నాలుగు రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై జీహెచ్ ఎంసీ చర్యలు తీసుకుంది. బీజేపీ ఆఫీస్ బయట కేసీఆర్ సర్కార్ కు కౌంట్ డౌన్ అంటూ డిజిటల్ అడ్వర్టైజ్ మెంట్ హోర్డింగ్ పెట్టారు.  దీనిపై అభ్యంతరం తెలుపుతూ టీఆర్ఎస్ నేతలు బల్దియాకు ఫిర్యాదు చేశారు. అటు బల్దియా అధికారులు కూడా వెంటనే యాక్షన్ తీసుకున్నారు. బీజేపీ ఆఫీస్ బయట ఏర్పాటు చేసిన దానికి రూ.55 వేల ఫైన్ వేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో అధికారులు తెలియజేశారు.

సాలు దొర- సెలవు దొర అంటూ బీజేపీ పెట్టిన హోర్డింగ్ కు కౌంటర్ గా పరేడ్ గ్రౌండ్స్ దగ్గర భారీ హోర్డింగ్ లను టీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేశారు. సాలు మోడీ సంపకు మోడీ అనే స్లోగన్ తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వచ్చే నెల 3వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న భారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. దీంతో మోడీకి వ్యతిరేకంగా ఇక్కడ హోర్డింగ్ లను టీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేశారు. అయితే.. రాత్రి వెలిసిన బై బై మోడీ ఫ్లెక్సీలు బుధవారం ఉదయం కొంతమంది వ్యక్తులు తొలగించారు.

తెలంగాణలో టీఆర్ఎస్ జీరో, బీజేపీ హీరో అవడంతోనే ఫ్లెక్సీలు పెట్టకుండా అధికార పార్టీ నాయకులు ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల గురించి ప్రజలకు తెలియకుండా చేయాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందన్నారు. బీజేపీ ఫ్లెక్సీలు మాత్రమే జీహెచ్ఎంసీకి కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీ, -టీఆర్ఎస్ నేతలు సిటీ అంతటా పోటా పోటీగా ఫ్లెక్సీల ఏర్పాటు చేస్తుండగా.. ఈ ఫ్లెక్సీలతో ట్రాఫిక్ జామ్ తప్ప తమకేం ఉపయోగం అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ప్రచారానికి కోట్లు ఖర్చు చేసే బదులు ఆగిపోయిన ప్రభుత్వ పథకాలకు నిధులిస్తే బాగుటుందని సలహాలు ఇస్తున్నారు.