ఆన్‌లైన్ షాపింగ్‌లో రారాజుగా కొనసాగుతున్న ఫ్లిప్‌కార్ట్ త్వరలోనే ఫుడ్ డెలివరీ రంగంలోకి కూడా రాబోతోంది. ఇప్పటికే కిరాణా సామాగ్రిని నిమిషాల్లో డెలివరీ చేస్తూ 'మినిట్స్' క్విక్ కామర్స్ ద్వారా దూసుకుపోంది వాల్‌మార్ట్ యాజమాన్యంలోని సంస్థ. త్వరలో ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టేందుకు ఇప్పుడు రంగం సిద్ధం చేసుకుంటోంది. మే లేదా జూన్ నెలలో బెంగళూరు వేదికగా పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి.. 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాలని అనుకుంటోంది.
ప్రస్తుతం భారత్‌లో ఫుడ్ డెలివరీ మార్కెట్ విలువ సుమారు 9 బిలియన్ డాలర్లు కాగా.. 2030 నాటికి ఇది 25 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం ఈ రంగంలో జొమాటో, స్విగ్గీలు తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ దిగ్గజాలకు గట్టి పోటీనిస్తూ.. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా ఫ్లిప్‌కార్ట్ పావులు కదుపుతోంది. దీని కోసం ఒక ప్రత్యేక ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించాలా లేకపోతే ప్రభుత్వ మద్దతు ఉన్న ONDC నెట్‌వర్క్ ద్వారా రావాలా అనేదానిపై సమాలోచనలు చేస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ ఈ సాహసానికి పూనుకోవడానికి ప్రధాన కారణం దాని ఐపీఓ ప్లానే. పబ్లిక్ లిస్టింగ్‌కు వెళ్లే ముందు కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కుంటున్న కంపెనీకి, ఫుడ్ డెలివరీ ఒక గొప్ప అవకాశంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ వద్ద ఇప్పటికే 800కు పైగా డార్క్ స్టోర్లు ఉన్నాయి. ఈ బలమైన లాజిస్టిక్స్ నెట్‌వర్క్ ఆహారాన్ని వేగంగా డెలివరీ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ భావిస్తోంది.
అయితే ఈ రంగంలో నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. గతంలో ఉబెర్ ఈట్స్, అమెజాన్, ఓలా వంటి దిగ్గజాలు ప్రయత్నించి భారీ నష్టాలతో వెనక్కి తగ్గాయి. ప్రస్తుతం రాపిడో కూడా 'ఓన్లీ' పేరుతో రంగంలోకి దిగుతోంది. జొమాటో, స్విగ్గీలు ఇప్పటికే 20 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేస్తూ బలంగా ఉండగా.. ఇలాంటి పోటీ వాతావరణంలో, ఫ్లిప్‌కార్ట్ తన భారీ పెట్టుబడులు విస్తృతమైన కస్టమర్ బేస్‌తో ఏ మేరకు విజయం సాధిస్తుందనేది వేచి చూడాల్సిందే. ఒకవేళ ఫ్లిప్‌కార్ట్ విజయవంతమైతే.. వినియోగదారులకు మరింత మెరుగైన ఆఫర్లు, వేగవంతమైన సేవలు అందే అవకాశం ఉంది.
