జంట జలాశయాల్లోకి భారీగా వరద..గండిపేట 10 గేట్లు ఓపెన్..హిమాయత్ సాగర్ 3గేట్లు ఓపెన్

జంట జలాశయాల్లోకి భారీగా వరద..గండిపేట 10 గేట్లు ఓపెన్..హిమాయత్ సాగర్ 3గేట్లు ఓపెన్

హైదరాబాద్​సిటీ, వెలుగు: సిటీ జంట జలాశయాల్లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు  చేరుతోంది.  అప్రమత్తమైన మెట్రోవాటర్​బోర్డు అధికారులు  హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట) జలాశయాల గేట్లు ఎత్తి వరద నీటిని దిగువ మూసీలోకి వదులుతున్నారు. మంగళవారం ఉస్మాన్ సాగర్ 10 గేట్లు ఎత్తి 2,300 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలారు. 

అలాగే  హిమాయత్ సాగర్ నుంచి మూడు గేట్లు ఎత్తి 2,900 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులినట్టు అధికారులు తెలిపారు.  ఉస్మాన్​ సాగర్​ పుల్ ట్యాంక్​ లెవెల్​1,790 అడుగులు కాగా ప్రస్తుతం 1789.50 అడుగుల నీరు ఉంది. హిమాయత్​ సాగర్​ ఫుల్​ట్యాంక్​ లెవెల్​ 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.70 అడుగులు నిల్వ ఉంది. ఈ రెండు జలశయాలకు 900 క్యూసెక్కుల ఇన్​ఫ్లో కొనసాగుతోంది. 

ఉస్మాన్ సాగర్ నుంచి నీటి విడుదల చేయడంతో నార్సింగ్,  మంచిరేవుల మధ్యన కల్వర్టుపై నుంచి భారీ వరద ప్రవహిస్తోంది. ఈ నేపత్యంలో కల్వర్టుపై నుంచి రాకపోకలు నిలిపివేశారు. లోతట్టు, మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివాసముంటున్న వారిని అధికారులు అప్రమత్తం చేశారు.