- సీఎం హోదాలోనే రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు: మల్లు రవి
న్యూఢిల్లీ, వెలుగు: ఎమ్మెల్యేల ఫిరాయింపు ఆరోపణల్లో వాస్తవం లేదని, అదే విషయం స్పీకర్ విచారణలోనూ తేలిందని తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) కన్వీనర్ మల్లు రవి తెలిపారు. కేవలం సీఎం హోదాలోనే రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారన్నారు.
బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1948లో మహాత్మా గాంధీని నాథూరాం గాడ్సే హత్య చేయడాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. అప్పుడు ఆయన్ని శారీరకంగా లేకుండా చేసిన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ప్రజల మనసుల్లో నుంచి తుడిచేయాలనే కుట్రకు తెరలేపిందని మండిపడ్డారు.
అందులో భాగంగానే... ఆర్ఎస్ఎస్ సర్కార్ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించిందని ఫైర్ అయ్యారు. ‘జాతి పిత’గా దేశమంతా గౌరవిస్తోన్న మహాత్మా గాంధీ పేరును తొలగించడం యావత్ దేశాన్ని కించపరచడమేనని చెప్పారు. కేంద్రం మార్పులతో ప్రవేశ పెట్టిన గ్రామీణ్ వీబీ జీరామ్‌జీ బిల్లు–2025తో రాష్ట్రాలపై మరింత భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వమే నూటికి నూరు శాతం ఈ పథకం కోసం నిధులు కేటాయించేదని.. కానీ, ఇప్పుడు 60 శాతానికి తగ్గించి, రాష్ట్రాలను 40 శాతం భరించాలని అంటున్నారని, దీనివల్ల రాష్ట్రాలపై తీరని ఆర్థిక భారం పెరుగుతుందన్నారు.
