- న్యాయపోరాటం చేస్తం.. వదిలేది లేదు: కేపీ వివేకానంద
- ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆత్మహత్య చేసుకోవాలి: కల్వకుంట్ల సంజయ్
హైదరాబాద్, వెలుగు: ట్రిబ్యునల్ చైర్మన్‌గా అసెంబ్లీ స్పీకర్ పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. ‘‘ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఏం కాదని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ మాటలనే ఇప్పుడు స్పీకర్ తన తీర్పులో చెప్పారు. స్పీకర్ తీర్పు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు వెళ్తాం. న్యాయపోరాటం చేస్తాం” అని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడారు. కేవలం ఐదుగురిపైనే స్పీకర్ తీర్పు ఇచ్చారని, మిగతా ఐదుగురి గురించి అడిగితే సరైన సమాధానం లేదని దుయ్యబట్టారు. ‘‘కడియం శ్రీహరి, దానం నాగేందర్‌కు నోటీసులు ఇచ్చినా వాళ్లు ఇంకా స్పందించలేదు.
వారిని అనర్హులుగా ప్రకటించాలి. జడ్జిమెంట్ కాపీ అడిగితే ఇవ్వలేదు. త్వరలో అప్లోడ్ చేస్తామని చెప్పారు” అని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆత్మహత్య చేసుకోవాలనిఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. జడ్జిమెంట్ ఆర్డర్ కాపీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి వచ్చిందని, అక్కడే తీర్పును ఎప్పుడో నిర్ణయించేశారని ఆయన ఆరోపించారు.
