ఖమ్మం జిల్లాలో పోలింగ్ కేంద్రాల దగ్గర ఉద్రిక్త వాతావరణం.. తల్లాడ మండలంలో ఇరు వర్గాల మధ్య తోపులాట

ఖమ్మం జిల్లాలో పోలింగ్ కేంద్రాల దగ్గర ఉద్రిక్త వాతావరణం.. తల్లాడ మండలంలో ఇరు వర్గాల మధ్య తోపులాట

తల్లాడ : ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారిగూడెం పంచాయతీ పోలింగ్ కేంద్ర వద్ద ఇరువర్గాల ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. ఓట్ల లెక్కింపు సమయంలో బీఆర్ఎస్ 9 వార్డులు, కాంగ్రెస్ 5 వార్డులు గెలిచాయి. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తల పోలింగ్ కేంద్రం గేటు వద్దకు రావడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. కాంగ్రెస్ కార్యకర్తలు పిల్లలమర్రి దిలీప్, కిన్నెర ఉదయ్ కుమార్ గాయపడ్డారు. వైరా సీఐ వెంకట ప్రసాద్ సిబ్బందితో వెళ్లి ఇరువర్గాలకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. 

భద్రాద్రి జిల్లాలో...

టేకులపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బద్దుతండా పంచాయతీ పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. ఓ వ్యక్తి గుర్తింపు కార్డు లేకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. ఓటేసేందుకు అధికారులు నిరాకరించడంతో వెనుదిరిగాడు. తర్వాత గుర్తింపు కార్డుతో మరోసారి వచ్చాడు.   కాంగ్రెస్ అభ్యర్థి సదరు వ్యక్తి దొంగ ఓటు వేస్తున్నాడని ఆరోపిస్తూ ఆగ్రహానికి గురై అతడిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.