- కొన్ని రంగాల్లో మహిళలే ముందున్నరు: మీనాక్షి నటరాజన్
- ఎన్నో సవాళ్లను దీటుగా ఎదుర్కొంటున్నారని వ్యాఖ్య
- మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం: మంత్రి వివేక్
- ‘22వ సీడీ దేశ్‌ముఖ్ మెమోరియల్ లెక్చర్’ సెమినార్‌కు హాజరు
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయం, నిర్మాణ రంగం, ఆధునిక వృత్తుల్లో పురుషులతో సమానంగా మహిళలు పని చేస్తున్నారని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. కొన్ని రంగాల్లో పురుషుల కంటే మహిళలే అధిక సంఖ్యలో ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ లోని విద్యారణ్య స్కూల్ లో కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో ‘22వ సీడీ దేశ్ ముఖ్ మెమోరియల్ లెక్చర్’ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సెమినార్ కు మీనాక్షి నటరాజన్ చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు.
“మహిళ.. ఎప్పటినుంచో పురుషాధిక్య వ్యవస్థ (పితృస్వామ్యం) నుంచి బయటపడేందుకు నిరంతరంగా పోరాడుతున్నది. చరిత్రలో ప్రతి కీలక దశలో మహిళలు పితృస్వామ్యాన్ని ప్రశ్నిస్తూ, సవాల్ విసురుతూ ముందుకు సాగారు. వేల ఏండ్లుగా పితృస్వామ్యాన్ని బలపరిచే ప్రయత్నాలు జరిగినప్పటికీ.. చరిత్ర, సమకాలీన సంఘటనలు భిన్నమైన వాస్తవాన్ని చూపిస్తున్నాయి. ఇండియాలో పితృస్వామ్యాన్ని సవాలు చేసిన ప్రముఖుల్లో మహాత్మా గాంధీ ఒకరు.
మహిళలకు మాత్రమే పరిమితమని భావించిన పనులను గాంధీ స్వయంగా చేసి చూపించారు” అని మీనాక్షి నటరాజన్ అన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పటికీ, దాని అసలు ఉద్దేశ్యం నెరవేరుతున్నదా అని అనుమానం వ్యక్తం చేశారు. సతీ సహగమనాన్ని సవాలు చేసిన వారిలో రాజా రామ్‌మోహన్‌రాయ్ కీలక వ్యక్తి అని, 19వ శతాబ్దంలో మహిళా విద్య కోసం సావిత్రీబాయి పూలే, ఫాతిమా బీబీ పోరాడారన్నారు.
నా భార్య, కూతురు కర్తవ్యాలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నరు: మంత్రి వివేక్
మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వివేక్ అన్నారు. ‘‘మా ఆవిడ గతంలో హౌజ్ వైఫ్ గా ఉండేది. నాన్న చనిపోయాక ఒక విద్యా సంస్థకు ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించాం. తన కర్తవ్యాన్ని ఆమె సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. విద్యా సంస్థలను ఎంతో అభివృద్ధి చేశారు. దేశంలోనే ప్రముఖ ఇన్స్టిట్యూషన్గా తీర్చిదిద్దారు. నా కూతురు మీడియా హౌజ్‌ను నడిపిస్తున్నది. ఈ సెమినార్ లో ఓ మహిళ.. స్కూల్ పెట్టడం తన డ్రీమ్ అని చెప్పింది. ఇది అభినందనీయం. ఈ సెమినార్ కు హాజరయ్యాక.. నా భార్యకు మరిన్ని బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించుకున్న’’ అని మంత్రి వివేక్ అన్నారు.
