- వివిధ అంశాలపై అధికారులతో మంత్రి ఉత్తమ్ రివ్యూ
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లపై ప్రభుత్వం కసరత్తు స్పీడప్ చేసింది. ఈ నెల 23 నుంచి మేడిగడ్డ బ్యారేజీ వద్ద టెస్టులు చేయించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. పుణేకి చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) 23 నుంచి టెస్టులు చేసేందుకు రంగంలోకి దిగుతున్నట్టు తెలిసింది. సెక్రటేరియెట్‌లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. బుధవారం అధికారులతో ఇరిగేషన్ అంశాలపై రివ్యూ చేశారు.
ఈ సందర్భంగా మేడిగడ్డ రిపేర్లతో పాటు తుమ్మిడిహెట్టి డీపీఆర్, సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్, ఎస్ఎల్ బీసీ, పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్, పోలవరం–నల్లమల సాగర్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ తదితర అంశాలపై చర్చించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లపై చర్యలను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించినట్టు సమాచారం. మరోవైపు బ్యారేజీ వద్ద జియో టెక్నికల్, జియో ఫిజికల్ టెస్టులకు అయ్యే ఖర్చును భరించేందుకు ఆ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ అంగీకరించినట్టు తెలిసింది. టెస్టులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నట్టు సమాచారం.
ఈ నెల 19న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు పునరుద్ధరణ డిజైన్ల బాధ్యతను సంస్థకు అప్పగించనున్నారు. ఇప్పటికే మూడు సంస్థలకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్, ప్రైస్ బిడ్‌ను పంపించిన సంగతి తెలిసిందే. ఆ మూడు సంస్థల్లో ఒకదానికి డిజైన్ల బాధ్యతను అప్పగించనున్నారు. అనంతరం సంస్థ డిజైన్లు ఇచ్చాక.. వీలైతే జనవరి నుంచి బ్యారేజీల వద్ద రిపేర్ల పనులు చేపట్టేందుకు యోచిస్తున్నట్టు తెలిసింది.
