ఎస్టీ గురుకులాల్లోనూ ‘ఈట్ రైట్’

 ఎస్టీ గురుకులాల్లోనూ ‘ఈట్ రైట్’
  • ఫుడ్ పాయిజన్​కు చెక్ పెట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలు
  • 3 నెలలుగా 300 మంది టీచర్లకు ట్రైనింగ్ ఇస్తున్న హెల్త్ ఆఫీసర్లు
  • ఫుడ్​పై అవగాహన కోసం ప్రతి క్లాస్​కు బుక్స్ అందజేత

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగాఎస్టీ గురుకులాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ సొసైటీల్లో (ఈఎంఆర్ఎస్) ఫుడ్ పాయిజన్ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే కొన్నేండ్లుగా ఎస్సీ గురుకులాల్లో ‘ఈట్ రైట్’ కొనసాగుతుండగా తాజాగా ఎస్టీ గురుకులాల్లోనూ అమలు చేయాలని నిర్ణయించారు. ‘ఈట్ రైట్’ కార్యక్రమంలో భాగంగా ‘సురక్ష, పౌష్టికాహారం, శుభ్రమైన గురుకులం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నది. 

గతంలో గురుకులాల్లో కుక్ లకు ట్రైనింగ్ ఇవ్వగా.. గత 3 నెలలుగా ఈఎంఆర్ఎస్ పరిధిలో పనిచేస్తున్న 300 మంది టీచర్లకు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) హెల్త్ డిపార్ట్ మెంట్ నిపుణులతో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. వీరిని హెల్త్ వెల్ నెస్ అంబాసిడర్లుగా అధికారులు ఖరారు చేశారు. ఈ ట్రైనింగ్ చివరి దశకు చేరుకున్నది. 

వారంలో 2 రోజులు బుక్స్ చదివించే బాధ్యత

రాష్ట్రంలో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషనల్ సొసైటీ పరిధిలో 145 స్కూళ్లు, తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ సొసైటీ పరిధిలో 23 స్కూళ్లు ఉన్నాయి. ఇందులో సుమారు లక్ష మంది స్టూడెంట్లు చదువుతున్నారు. వీరికి ఒకటో తరగతి నుంచి 5 వరకు, 6 నుంచి 10వ తరగతిగా అధికారులు డివైడ్ చేశారు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, వాటిలో ఉండే పోషకాలతో కూడిన బుక్ లను అధికారులు అందజేశారు. అందరూ స్టూడెంట్స్ కు కలిపి ఈట్ రైట్ బుక్, 1 నుంచి 5 తరగతి వరకు ది ఎల్లో బుక్, 6 నుంచి 8వ తరగతి స్టూడెంట్స్ కు పింక్ బుక్, 9, 10 స్టూడెంట్స్ కు గ్రీన్ బుక్ అందజేశారు. 

వారంలో రెండు రోజులు స్టూడెంట్లతో ఈ బుక్ చదివించాలని టీచర్లను సొసైటీ అధికారులు సూచించారు. జిల్లాల్లో పనిచేస్తున్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, హెల్త్ ఆఫీసర్లను సైతం గురుకులాల్లో వారానికి ఒకసారి వచ్చి ‘ఈట్ రైట్’పై టీచర్లు, వార్డెన్లు, స్టూడెంట్స్ కు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సొసైటీ అధికారులు నిర్ణయించారు. ఈ అంశంపై ఎస్టీ గురుకుల సెక్రటరీ త్వరలో అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాయనున్నట్లు తెలుస్తున్నది.