
- ఏటా నీటి మునుగుతున్న లోతట్టు కాలనీలు
- సిరిసిల్ల శాంతినగర్ లో నిలిచిన వరద మళ్లింపు పనులు
రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కొద్దిపాటి వానకే జలమయంగా మారుతోంది. సిరిసిల్ల పట్టణంలో ఓ మోస్తారు వర్షం పడితే దాదాపు పది కాలనీల వరకు నీటి మునుగుతున్నాయి. ఏటా ఇదే సమస్య తలెత్తినా ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగితాలకే పరిమితమైన ప్రతిపాదనలు
2022లో సెప్టెంబర్ లో భారీ వర్షాలు పడినపుడు సిరిసిల్లలో పది లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అప్పటి మంత్రి, సిరిసిల్ల ఎమ్యెల్యే కేటీఆర్ ముంపు కాలనీల్లో పర్యటించి సిరిసిల్లకు వరదలు రాకుండా చేస్తానని హామీ ఇచ్చారు. దీని కోసం ఆఫీసర్లు ప్రతిపాదనలు రెడీ చేయమని చెప్పారు. కేటీఆర్ ఆదేశానుసారం ఆఫీసర్లు రూ. 280 కోట్లతో ప్లానింగ్ చేశారు. సిరిసిల్ల ఎగువ ప్రాంతంలో ఉన్న చెరువులు మత్తడి దూకినప్పుడల్లా ఆ నీరు సిరిసిల్ల పట్టణాన్ని తాకుతోంది. ఈ నీరు సిరిసిల్ల టౌన్ తాకకుండా వరద కాల్వ నిర్మించేందుకు ఆఫీసర్లు ప్లాన్ రెడీ చేసినా ఆ ప్రతిపాదనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి.
టౌన్ కు తప్పని వరద ముప్పు
పెద్ద వర్షం పడితే సిరిసిల్ల ఏటా ముంపునకు గురవుతోంది. సిరిసిల్ల ఎగువ ప్రాంతంలో ఉన్న 20 చెరువులు మత్తడి దూకడంతో ఆ వరద నీరు సిరిసిల్ల పట్టణాన్ని ముంచెత్తుతోంది. ఈదుల చెరువు, పెద్ద చెరువు,కొలనూరి చెరువు, మర్తనపేట చెరువు, జంగం వాణి చెరువు, భామని కుంట, ఎర్ర కుంట, కొలనూర్ ట్యాంక్, గిర్ర వాణి కుంట చెరువులు పొంగినప్పుడు సిరిసిల్ల పాత బస్టాండ్, వెంకంపేట, ప్రగతి నగర్, బీవై నగర్, సుందరయ్య నగర్, శాంతినగర్, సంజీవయ్య నగర్, అంబేద్కర్ నగర్, పాత బస్టాండ్ కాలనీలు నీటి మునుగుతున్నాయి.
ఈదుల చెరువు, కొత్త చెరువుకు మరమ్మతులు
2022 సెప్టెంబర్‌లో వరదలు వచ్చినప్పుడు ఈదుల చెరువు, కొత్త చెరువు మత్తడి దూకి సిరిసిల్ల పాత బస్టాండ్ తో పాటు కలెక్టరేట్ ముంపునకు గురైంది. కలెక్టరేట్‌లో ఉన్న అప్పటి కలెక్టర్ అనురాగ్ జయంతిని జేసీబీ వాహనంలో బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఈదుల చెరువుకు, కొత్త చెరువుకు మత్తడి దూకకుండా మరమ్మతులు చేయించారు. ఈ రెండు చెరువులకు షట్టర్ లు బిగించారు. చెరువు నిండితే వెంటనే షట్టర్ గేట్లు ఓపెన్ చేసి నీటిని బయటకు వదిలేలా ఆఫీసర్లు అప్రమత్తమవుతున్నారు. దీంతో సిరిసిల్ల కలెక్టరేట్ ముంపునకు గురికాకుండా ఉంటోంది.