
లీడర్లపై వరద బాధితుల ఆగ్రహం.. గల్లీగల్లీలో నిలదీతలు, ధర్నాలు
టీఆర్ఎస్ అనుచరులకే సాయం చేస్తున్నారని మండిపాటు
మంత్రులు, కార్పొరేటర్ల ఎదుట నిరసనలు
బాధితులపై బీర్ బాటిళ్లతో టీఆర్ఎస్ నేతల దాడులు
కార్పొరేటర్ల వరద రాజకీయాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సాయంపై హైదరాబాద్ గల్లీల్లో లొల్లి లొల్లి అవుతోంది. తమకు పరిహారం అందడం లేదంటూ చాలా చోట్ల బాధితులు ఆందోళనలు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల ఎదుటనే ధర్నాకు దిగుతున్నారు. టీఆర్ఎస్ అనుచరులకే సాయం చేస్తున్నారని, అసలైన బాధితులను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల లీడర్లు, అధికారులు కలిసి సాయంలో కోతపెడుతున్నారు. రికార్డుల్లో రూ.10 వేలు ఇచ్చినట్లు రాసుకుని, రూ.5 వేలే ఇస్తున్నారు. కొన్నిచోట్ల అసలు ఇవ్వకున్నా ఇచ్చినట్లు రాసుకుని వెళ్తున్నారు. మరికొన్ని చోట్ల లీడర్లు డబ్బు పంచి వెళ్లాక.. వారి అనుచరులు వచ్చి మళ్లీ కొంచెం వెనక్కి తీసుకుంటున్నారు. ఇలా ఎక్కడ చూసినా ఏదో ఒక గొడవ. రూ.10 వేల సాయం అందని బాధితుల ఆందోళనలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్‌లో నీట మునిగిన ప్రాంతాల జనాలకు ప్రభుత్వం రూ.10 వేల ఆర్థిక సాయం ప్రకటించింది. ఇందుకు 235 ప్రాంతాలను గుర్తించగా, ఇందులో స్థానిక కార్పొరేటర్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ సిబ్బంది కలిసి నీట మునిగిన ప్రాంతాల జనాలకు సాయం అందజేస్తున్నారు. కొన్ని చోట్ల అసలైన బాధితులకు ఇవ్వకుండా పార్టీ అనుచరులకు రూ.10 వేలు ముట్టజెప్పడంతో బాధితులు రోడ్డెక్కుతున్నారు. టీఆర్ఎస్ నేతలు చెప్పిన వారికి పైసలు ఇస్తుండటంతో ఆందోళనకు దిగుతున్నరు. నేతలను అడ్డుకుని ధర్నాలు, నిరసనలకు దిగుతుండగా, ఇచ్చిన దానిలో టీఆర్ఎస్ నేతలు సగం పైసలు గుంజుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
సగం పంచుడు… సగం మింగుడు
గాజులరామారం డివిజన్ పరిధిలోని ప్రకాశం పంతులు నగర్, చంద్రగిరినగర్, ఖైసర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో అధికారులు నాలుగు రోజుల క్రితం పరిహారం పంపిణీ చేశారు. బాధితుల పేర్లు, ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లు రికార్డు చేసుకున్న అధికారులు.. డబ్బు ముట్టినట్టు వారితో సంతకాలు తీసుకున్నారు. అయితే నగదు కాలమ్ మాత్రం నింపకుండా ఖాళీగా వదిలేశారు. బాధితులకు రూ.5 వేలు ఇచ్చారు. తర్వాత పది వేలు ఇచ్చినట్టుగా రాసుకున్నారు. 220 మంది బాధితులకు రూ.22 లక్షలు పంపిణీ చేసినట్లు లెక్కచూపారు. ఇందులో దాదాపు రూ.11 లక్షలు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధి జేబుల్లోకి చేరాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బీర్ బాటిళ్లు, రాళ్లతో దాడి
గ్రీన్ హిల్స్ కాలనీ లోని మంత్రి సబితారెడ్డి క్యాంపు కార్యాలయం ముందు ఎన్టీఆర్ నగర్ కు చెందిన వరద బాధితులు ఆందోళనకు దిగారు. బాధితులందరికీ ఆర్థిక సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుడి మల్కాపూర్ డివిజన్లో తమకు వరద సాయం అందకుండా చేశాడని కార్పొరేటర్ బంగారు ప్రకాశ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్పొరేటర్ చెప్పిన 50 మందికి మాత్రమే ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారని బాధితులు మండిపడ్డారు. కూకట్ పల్లి డివిజన్ దయారగూడ, సంగీత్‌నగర్ కాలనీల్లో బాధితులకు న్యాయం చేయాలంటూ ఆందోళనలకు దిగిన బీజేపీ నేతలపై టీఆర్ఎస్ నేతలు, కార్పొరేటర్ అనుచరులు బీర్ బాటిళ్లు, రాళ్లతో దాడి చేశారు.
అన్నీ చోట్ల ఏదో ఒక లొల్లి
వినాయక్ నగర్ కార్పొరేటర్ భర్త.. బాధితులకు డబ్బులు పంచి వెళ్లిన వెంటనే, ఆయన అనుచరులు బాధితుల నుంచి రెండు వేలు వసూలు చేస్తున్నారు. స్థానికులు రోడ్లపైకి వచ్చి తిరగబడటంతో కార్పొరేటర్ అనుచరులు పరారయ్యారు.
రాజేంద్రనగర్ మండల పరిధిలోని సులేమాన్ నగర్, మైలార్ దేవ్ పల్లి, అత్తాపూర్, రాజేంద్ర నగర్ డివిజన్ లోని పలు బస్తీల్లో స్థానిక అధికార పార్టీ నాయకులు రూ.3 వేలు నొక్కేసి మిగతా డబ్బు ఇస్తున్నారని బాధితులు వాపోయారు.
జియాగూడలోని ఇందిరానగర్ లో ఆర్థిక సాయం అందించేందుకు అధికారులు రావడం లేదని బాధితులు నిరసన తెలిపారు.
తమ కార్యకర్తలకు, బంధువులకు, అపార్ట్మెంట్ల వాసులకే టీఆర్ఎస్ నాయకులు సాయం అందిస్తున్నారని, బాధితులను పట్టించుకోలేదని నేరెడ్ మెట్‌లోని జేజే నగర్ వాసులు మండిపడ్డారు.
అర్హులైన వారికి కాకుండా ఇతరులకు సాయం అందుతోందని కూకట్‌పల్లిలోని అస్బెస్టాస్ కాలనీలో మహిళలు ఆందోళనకు దిగారు.
చార్మినార్ జోన్ పరిధిలోని చాంద్రాయణగుట్ట, మలక్ పేట నియోజకవర్గాల పరిధిలో నీట మునిగిన డివిజన్లలో తమకు పరిహారం అందలేదని బాధితులు ఆందోళనకు దిగారు.
నాగోల్ డివిజన్ లోని త్యాగరాయ కాలనీ, మల్లికార్జున్ నగర్ కాలనీల్లో బాధితులు ఆందోళన దిగారు. ఇండ్లలోకి నీరు చేరి నష్టపోయిన తమను పట్టించుకోవడంలేదని వాపోయారు. టీఆర్‌ఎస్ లీడర్లు వారికి కావల్సిన వారికి ఇచ్చుకొని బాధితులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
కవాడిగూడలో బాధితులు కాకున్నా చాలా మందికి టీఆర్ఎస్ నేతలు 10 వేలు పంచారు.
ఎస్ఆర్ నగర్‌లోని నిజాం బస్తీ, దసరాం బస్తీల్లో నేతలు చెప్పిన వారికే అధికారులు రూ.10 వేలు ఇస్తున్నారని బాధితులు ఆందోళన చేశారు.
తమకు అందాల్సిన సాయం ఎవరికో ఇస్తున్నారని హఫీజ్ పేట్ డివిజన్ వార్డు కార్యాలయం వద్ద మహిళలు నిరసనలు చేపట్టారు.
పాతబస్తీ పురానాపూల్ లో నగదు ఇవ్వకుండానే సంతకాలు, ఆధార్ కార్డులు తీసుకొని వెళ్లిపోయారని ఆందోళన చేపట్టారు.
గోషామహల్ లోని నేతాజీ నగర్ బస్తీ వాసులు.. అబిడ్స్ జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసు ముందు ధర్నా చేశారు. కార్పొరేటర్, అధికారులు కుమ్మక్కై బాధితులకు సాయం ఇవ్వడం లేదని ఆరోపించారు. 10 వేలు ఇచ్చేందుకు అధికారులు రూ.5 వేల కమీషన్ అడుగుతున్నారని మండిపడ్డారు.
హిమాయత్ నగర్ డివిజన్ లో నాలా వెంబడి ఉన్న దత్తానగర్, స్ట్రీట్ నెం.1, 14, తదితర కాలనీల్లో.. ఇండ్లలో నుంచి నీరు వెళ్లిపోయాయని, సాయం ఇవ్వబోమని అధికారులు చెప్పారు.
ఓల్డ్ కబేలా బస్తీలో ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఆర్థిక సాయం గొడవకు కారణమైంది.
నాంపల్లి డివిజన్ లోనూ 100 మందికి ఆర్థిక సాయం చేస్తామని చెప్పిన అధికారులు, కొంత డబ్బు తీసుకుని ఇస్తామనడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హస్తినాపురంలో స్థానికులు కార్పొరేటర్ పద్మానాయక్ ను రోడ్డుపైనే నిలదీశారు. బాధితులకు పరిహారం ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు.
సారూ.. సాయం అందలే
‘‘మా ఇండ్లన్నీ నీళ్లలో మునిగిపోయాయి.. ఇప్పటిదాకా మాకు వరద సహాయం అందలేదు.. కొంచెం మాపై దయుంచి వరద
సహాయం అందించరా సారూ..” అంటూ తార్నాక డివిజన్ లాలాపేటకు చెందిన పలువురు మహిళలు మంత్రి కేటీఆర్ ను వేడుకున్నారు. గురువారం లాలాపేటలో పెండ్లికి వచ్చిన కేటీఆర్ తిరిగి వెళ్తుండగా ఇలా అడ్డుకుని అడిగారు.
5 వేలే ఇస్తమంటున్నరు
రూ.10 వేలు ఇవ్వడానికి రూ. 5 వేల కమీషన్ అడుగుతున్నరు. 5 వేలు ఇస్తే గానీ పైసలు ఇవ్వబోమంటున్నరు. వారం పది రోజులు నీళ్లలో మునిగి చిన్న పిల్లలతో అవస్థలు పడినా వీళ్లకు కనిపిస్తలేదు. ఇప్పుడేమో ఇస్తామని చెప్పి తిప్పుకుంటున్నరు.
– గబ్బిలాల్ పేట బస్తీకి చెందిన ఓ మహిళ
ఇవ్వకున్నా ఇచ్చినట్లు లెక్కలు
కుత్బుల్లాపూర్‌లోని జైరాంనగర్లో వరద నష్ట పరిహారం పంపిణీలో అధికారులు, లీడర్లు గోల్మాల్ చేశారు. జైరాంనగర్లో 100 మంది బాధితుల ఇంటి నంబర్లతో రూ.10 లక్షలు పంచినట్లు కాగితాల్లో లెక్క చూపారు. కానీ ఆయా ఇండ్లలో ఉన్న వాళ్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అన్ని ప్రాంతాల్లో బాధితులకు సాయం చేస్తున్న అధికారులు తమకు ఎందుకు ఇవ్వడం లేదని బాధితులు గురువారం కుత్బుల్లాపూర్ సర్కిల్ ఆఫీసుకు వెళ్లి అధికారులను నిలదీశారు. అధికారులు తమ వద్ద ఉన్న పంపిణీ లిస్ట్ చూపించి.. అప్పటికే వారి ఇళ్ల నంబర్లలో నగదు పంపిణీ చేసినట్టు తెలిపారు. అవాక్కయిన బాధితులు.. తమకు పరిహారం ఇవ్వలేదని చెప్పారు. దీంతో కుత్బుల్లాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మంగతాయారు గురువారం రాత్రి కాలనీకి సిబ్బందితో వెళ్లి మొదట నగదు పంపిణీ చేసినట్టు చూపించారో వారికి మళ్లీ నగదు పంపిణీ చేశారు. కానీ మొదట పంచిన సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లిందనే ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం లేదు.
లొల్లి పెడితే ఇచ్చిన్రు
వారం నుంచి నీళ్లలోనే ఉన్నాం. మంత్రి కేటీఆర్ పర్యటించి ప్రతి ఇంటికి వరద సాయం అందుతుందని చెప్పి వెళ్లిపో యారు. అధికారులేమో స్థానిక నేతలు చెప్పినోళ్లకే ఇస్తున్నరు. నేతాజీ నగర్ లోని వరద బాధితులందరం కలిసి లొల్లి చేస్తే, మళ్లీ వచ్చి పైసలు ఇచ్చిపోయారు.
‑ పవన్ కుమార్, రామంతాపూర్