స్వర్ణ ప్రాజెక్టుకి భారీ వరద.. మరోసారి గేట్లు ఎత్తివేత

స్వర్ణ ప్రాజెక్టుకి భారీ వరద.. మరోసారి గేట్లు ఎత్తివేత

నిర్మల్ జిల్లా: స్వర్ణ ప్రాజెక్టుకి మళ్లీ వరద పోటెత్తుతోంది. తగ్గుముఖం పట్టినట్లే కనిపించి మళ్లీ క్రమంగా పెరుగుతోంది. ఎగువన గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద పరవళ్లు తొక్కుతోంది. వరద పోటు పెరగడంతో నిర్మల్ జిల్లా సారంగపూర్ గ్రామం వద్ద నిర్మించిన స్వర్ణ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల ప్రారంభించారు అధికారులు. మరో మూడు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. 
గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తూ.. స్వర్ణ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. సారంగపూర్ మండలంతోపాటు మొత్తం గోదావరి నది పరివాక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు గేట్లను ఎత్తుతూ నీటి విడుదల కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు. 

4 గేట్లు ఎత్తి 30వేల క్యూసెక్కులు దిగువకు విడుదల

స్వర్ణ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుండడంతో.. 4 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల ప్రారంభించారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుతం 1180.7 అడుగులు ఉంది. ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకుని.. నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో వస్తున్న వరదను వస్తున్నట్లే దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇన్ ప్లో 35వేల క్యూసెక్కులు ఉండగా.. గేట్ల ద్వారా 30వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.